News

విద్యావంతులైన ముస్లిములు CAA పై అవగాహన కలిగించాలి – డాక్టర్ మోహన్ భాగవత్

874views

పౌరసత్వ సవరణ చట్టం గురించి సొంత సామాజిక వర్గంలోనే భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది ముస్లింలు పనిగట్టుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్ఎస్ సమావేశంలో మాట్లాడిన భగవత్ సాధారణ ముస్లిములలోని ఈ భయాన్ని తొలగించేందుకు భారత్‌లో చదువుకుని అత్యున్నత పదవుల్లో ఉన్న ముస్లింలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ భయాన్ని వారిలోనుంచి తొలగించే ప్రయత్నాలు చేయాలని భగవత్ కోరారు. దేశంలో హిందువులు, ముస్లింలు భారత పౌరులేనని పౌరసత్వ చట్టాన్ని చూసి ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఆరెస్సెస్ కార్యకర్తలు తమ ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేయాలని సూచించారు. భారత సమాజాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో విభజించడం శాపంగా పరిణమించిందని శ్రీ భాగవత్ అన్నారు. సమాజంలో ఐక్యత ఉండేలా అందరిని సమానత్వంతో చూసేలా కృషిచేయాలని భగవత్ పేర్కొన్నారు.

వివాదాలకు ఘర్షణలకు కార్యకర్తలు దూరంగా ఉండి ఆర్ఎస్ఎస్ సంస్థ విస్తరించేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతంపై గత 95 ఏళ్లుగా పనిచేస్తోందన్న మోహన్ భగవత్… అదే సిద్ధాంతాన్ని కొనసాగించాలని గాడి తప్పకూడదని చెప్పారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామి అయి… నాటి వైభవాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పారు.

ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రతి గ్రామానికి విస్తరించాలని, ఆమేరకు పనిచేయాలని కోరారు. ఇది 2025నాటికల్లా జరగాలని భగవత్ కార్యకర్తలకు సూచించారు. ఆర్‌ఎస్ఎస్‌ను విస్తరించడమే లక్ష్యంగా పని చేయాలని భగవత్ చెప్పారు. ఇక జనవరి 31న భాగవత్ మధ్యప్రదేశ్‌లోని గునలో పర్యటించనున్నారు. సంఘ్ పరివార్‌తో అనుబంధం ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.