News

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలి – ధర్మ జాగరణ సమితి

701views

హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువూ నడుం బిగించాలని రాష్ట్ర స్వామీజీల సంఘం అధ్యక్షుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి పిలుపునిచ్చారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పెదమానాపురంలోని వాసవీ కళ్యాణ మండపంలో సద్భావనా సదస్సు, భారతమాత పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్థానిక రామాలయం నుండి శోభాయాత్రను జరిపారు.

స్వామీజీల ప్రసంగాలకు ఆసక్తిగా ఆలకిస్తున్న భక్తులు

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న మత మార్పిడులను అడ్డుకోవాలని అన్నారు. మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావాలని కోరారు.  జన్మనిచ్చిన భూమిని, నీటిని ఇచ్చే నదులను, నీడనిచ్చే చెట్లను అలా సమస్త ప్రకృతిని తల్లిగా భావించడం హిందూ సంస్కృతి ప్రత్యేకత అని ఆయన అన్నారు. అందుకే వివిధ కులాల పెద్దలతో, మాతృమూర్తులతో కులమతాలకు అతీతంగా ఈ భరతమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నామని ఆయన తెలిపారు. మన దేశంలో మాత్రమే దేశాన్ని తల్లిగా భావించి భారతమాతగా పిలుచుకుంటామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనకు హిందూ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయన్నారు.

ధర్మ జాగరణ సమితి రాష్ట్ర ప్రముఖ శ్రీ తిరుపతయ్య మాట్లాడుతూ ఓంకార నాదం అతి పవిత్రమైనదని, ప్రతి కుటుంబంలో పొద్దున్నే ఓంకారాన్ని జపించడం అలవాటు చేసుకోవాలని, దానివల్ల వ్యక్తులలో, ఆ ఇంట్లో దైవీ శక్తి జాగృతం అవుతుందని తెలిపారు. మనమంతా హిందువులం, రక్త సంబంధం ఉన్న బంధువులం అన్నారు. మనందరం రాముడు, కృష్ణుడు, చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, యోగి అరవిందల వారసులము, మనందరి వారసత్వము, పరంపర ఒకటే అని ఆయన తెలిపారు.

కార్యక్రమానికి భారతమాత చిత్రపటంతో ఊరేగింపుగా వస్తున్న భక్తులు

ఈ కార్యక్రమంలో గంగగోళ్ళపెంట పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద స్వామి, ధర్మ జాగరణ సమితి విభాగ్ ప్రముఖ్ శ్రీ ఆర్. బలరామ నాయుడు, మాజీ సర్పంచ్ చుక్క సన్యాసినాయుడు, గ్రామ పెద్దలు రౌతు జగదీష్ నాయుడు, గొర్లి కృష్ణమూర్తి, కే కనకరాజు, ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖులు జాగరపు కృష్ణ, రమేష్, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.