
జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం అని ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత సప్తాహం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) తెలిపారు.
వడ్డేశ్వరంలోని అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంస్కృతం పండితుల భాష మాత్రమే అన్న అభిప్రాయాన్ని మార్చి, సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి అకాడమీ కృషి చేస్తోందన్నారు. సంస్కృత అకాడమీ ఏర్పాటైన తర్వాత తగిన నిధులు లభించలేదని, భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
సంస్కృత అకాడమీ అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వరఖేడి, భారతీయ భాషా సమితి చైర్మన్ కృష్ణస్వామి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
సంస్కృత సప్తాహం సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కొవ్వూరు, తణుకు, గుంటూరు, జిల్లెళ్లమూడి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుడివాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో సదస్సులు, ఉపన్యాసాలు, విద్యార్థులకు భారతం, భాగవతం తదితర అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంస్కృత భాషాభివృద్ధికి విశేష సేవలు అందించిన వ్యక్తులను సత్కరించనున్నట్లు తెలిపారు.
సప్తాహం ముగింపు కార్యక్రమం ఆగస్టు 31న విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 29న గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు అకాడమీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
సమావేశంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరమ్మ, డాక్టర్ ఎస్.ఏ.టి. రాజ్యలక్ష్మి, డాక్టర్ పి. కోటి రత్నం, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.టి.జి.వి. రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.





