News

బెంగాల్ సీఎంపై దాడికి కుట్ర.. జైషే ఉగ్రవాది ప్రియురాలు అరెస్ట్‌

5views

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై దాడి కోసం కుట్ర పన్నారనే ఆరోపణలపై అనుమానిత జైష్ ఉగ్రవాది ప్రియురాలిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రాజకీయ నాయకులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే హనీట్రాప్ నెట్‌వర్క్‌లో ఆమె భాగమని అనుమానిస్తున్నారు. బెంగాల్ సీఎం సువేందు అధికారిపై దాడికి జైష్-ఎ-మొహమ్మద్ కార్యకర్త హమీమ్ మండల్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు బెంగాల్‌ పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

దీంతో పూర్బ బర్ధమాన్‌లో అతడ్ని అరెస్ట్‌ చేశారు. కాగా, హమీమ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న అతడి ప్రియురాలు అర్పితా సర్కార్‌ ఈ నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు అనుమానించారు. సీఎం సువేందు అధికారిపై దాడి కోసం రాజకీయ నాయకులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేసే ఎత్తుగడలు ఆమె వేస్తున్నట్లు హమీమ్‌ విచారణ వివరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అర్పితను బెంగాల్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఆమె మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తులను గుర్తించేందుకు అర్పిత కాల్స్‌ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను కూడా విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ఈ నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించింది, ఇతర రాష్ట్రాల్లో కూడా వీరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నదని వెల్లడించారు.