
మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల కాంప్లెక్స్‌కు సమీపంలోని దర్గాలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ముస్లిం పక్షం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ప్రత్యామ్నాయ ప్రదేశంలో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఈ ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకి కావని స్పష్టం చేసింది.
ఈ నెల 14న కూడా భోజ్‌శాల కాంప్లెక్స్‌కు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో శుక్రవారం నమాజ్‌కు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని ఆరోపిస్తూ ముస్లిం పక్షానికి చెందిన హాజీ మునీర్ అహ్మద్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వం భోజ్‌శాల కాంప్లెక్స్‌కు సుమారు 1.3 కిలోమీటర్ల దూరంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించిందని, అయితే అక్కడి నుంచి భోజ్‌శాల సముదాయాన్ని చూడలేమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. భోజ్‌శాల–కమల్ మౌలా మసీదు సముదాయం కనిపించే ప్రాంతంలోనే నమాజ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
వాదనలు విన్న ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతి శుక్రవారం దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి కల్పించింది.:::





