News

యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు

263views

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నం నేవీ బృందం సోమవారం సందర్శించింది. చారిత్రక నేపథ్యమున్న ఉదయగిరి పేరుతో యుద్ధ నౌక రూపుదిద్దుకొని ఆగస్టు 26న ప్రారంభోత్సవం కానుండడంతో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ప్రశాంత్, బృంద సభ్యులు నరసింగరావు, నవీన్, ప్రకాష్‌కుమార్‌ స్థానిక పంచాయతీ అధికారులతో కలిసి దుర్గం కొండపై పర్యటించారు. పెద్ద మసీదు, చిన్న మసీదుతోపాటు అలనాటి చరిత్రకు గుర్తుగా ఉన్న కట్టడాలను పరిశీలించారు. ఉదయగిరి దుర్గం పేరుతో 149 మీటర్ల పొడవుతో 40 మిస్సైళ్లు ఉండేలా రూ.600 కోట్లతో యుద్ధ నౌక తయారై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. దీని గురించి తెలియజేయడంతోపాటు ఉదయగిరి చరిత్రను తెలుసుకొనేందుకు నేవీ బృందం పట్టణంలో పర్యటించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సర్పంచి పాములూరి సామ్రాజ్యం, పంచాయతీ కార్యదర్శి కరిముల్లాతో నేవీ బృందం చర్చించి ఈప్రాంత చారిత్రక విషయాలను తెలుసుకున్నారు. పంచాయతీకి నౌకాదళ కమిటీ నుంచి సంక్షేమ నిధులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తామని నేవీ బృందం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వారి వెంట పంచాయతీ సిబ్బంది ఉన్నారు.