News

ధర్మస్థల అస్థిపంజరాల కేసు: ముగ్గురు అదృశ్యులుగా గుర్తింపు

5views

కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలోని బంగ్ల గుడ్డ ప్రాంతంలో ఇటీవల వెలికితీసిన మూడు అస్థిపంజరాల గుర్తింపుపై స్పష్టత లభించింది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అవి గతంలో అదృశ్యమైన ముగ్గురు వ్యక్తులవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిర్ధారించింది.

సిట్‌ అధికారులు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల్లో అస్థిపంజరాలు కొడగు జిల్లా విరాజపేట తాలూకా టి. శెట్టిగేరి గ్రామానికి చెందిన యు.బి. అయ్యప్ప (70), తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా దాసరకల్లహళ్లికి చెందిన ఆదిశేష (27), కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా మీసగానహళ్లికి చెందిన కృష్ణప్పవిగా తేలినట్లు తెలిపారు. ఈ ముగ్గురూ పురుషులేనని, మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులతో వీరికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వివరాలను ఈ నెల 15న బెళ్తంగడి కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్‌ వెల్లడించింది.

దర్యాప్తు ప్రకారం, యు.బి. అయ్యప్ప 2017 జూన్‌ 25న మైసూరుకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదిశేష 2013 అక్టోబర్‌ 2న స్వగ్రామానికి వచ్చి, మొబైల్‌ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి అదృశ్యమయ్యాడు. కృష్ణప్ప 2024 అక్టోబర్‌ 22న ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయాడు. ఈ ముగ్గురి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆయా పోలీస్‌ స్టేషన్లలో మిస్సింగ్‌ కేసులు నమోదు చేశారు.

అయితే, అదృశ్యమైన ఈ ముగ్గురు బంగ్ల గుడ్డ ప్రాంతానికి ఎలా చేరుకున్నారు, వారి మరణాలకు గల కారణాలేమిటి అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.