News

హిందూ దేవతా విగ్రహాలను కాలువలో విసిరేసి అపవిత్రం చేసిన ఛాందసులు

219views

శివమొగ్గ బంగారప్ప బరంగేలోని ఓ పార్కులో వున్న గణేషుడు,నాగ దేవతా విగ్రహాలను యువకులు అపవిత్రం చేశారు. ఈ రెండు విగ్రహాలను సమీపంలోని కాలువలోకి విసిరేసి, అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెహ్మతుల్లా, సద్దాం అనే ముస్లిం ఛాందసులు ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

ఈ నెల మూడో తేదీన ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు వెంటనే ముస్లిం ఛాందసులు చేసిన పనిని గమనించి, ప్రతిఘటించారు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో కొన్ని గంటల్లోనే దుండగులను పట్టుకొన్నారు. వారిని వెంటనే శిక్షించాలని, హిందూ దేవతలను అవమానించారని, అపవిత్రం చేశారని మండిపడుతున్నారు.

ఈ ఘటన జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ స్పందించారు. అల్లర్లు మరింత పెరగకుండా వుండేందుకు అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని, ప్రజలు ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని, దర్యాప్తు సాగుతోందని తెలిపారు.ఇక స్థానికులు కూడా తీవ్రంగానే స్పందించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అన్ని మతాల వారూ సామరస్యంగా కలిసే వుంటున్నామని, ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకే ఇలాంటి పనులు చేశారని పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. శివమొగ్గ బీజేపీ ఎమ్మెల్యే చన్నబసప్ప ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వుండే ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ దేవీదేవతలను అవమానిస్తే మాత్రం సహించమని హెచ్చరించారు.

కర్నాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోందని, చూసీచూడనట్లు వుంటోందని మండిపడ్డారు.హిందూ వ్యతిరేక శక్తులు కొన్ని రోజులు మౌనంగానే వుండిపోయాయని,కానీ.. కాంగ్రెస్ అండదండలతో మళ్లీ రెచ్చిపోతున్నాయని విమర్శించారు.