NewsProgramms

‘సంఘమిత్ర’ సంస్కృతీ యజ్ఞం చేస్తోంది – ‘మాతృమిత్ర’ కార్యక్రమంలో వక్తలు.

184views

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ విలువలను ప్రతిబింబించే బొమ్మలకొలువు, భారతీయ నృత్యం సమాజానికి చక్కని సందేశాన్ని అందిస్తాయని, వాటి వలన మన దేశం యొక్క విలువలు ప్రపంచానికి తెలుస్తాయని నమ్మి వాటిని మాటలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో కూడా చూపిస్తూ “మాతృమిత్ర” ఆధ్వర్యంలో సంఘమిత్ర బొమ్మల కొలువుతోపాటు బాలికల నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసిందని సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ నాగసుబ్బారెడ్డి వివరించారు. సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 29వ తారీఖున మహా దుర్గా దేవి పూజ తో దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో శ్రీ నాగ సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మనలోని దుర్గుణాలను తొలగించి మంచిని పెంచునట్లు ఉండాలని, మన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేవిగా ఉండాలని సూచించారు.

బాలికల్లో నిబిడీకృతమై ఉన్న కళలను వెలికి తీయడం కోసం ‘మాతృమిత్ర’ పేరుతో సంఘమిత్ర చేస్తున్న ఈ ‘సంస్కృతీ యజ్ఞం’ నిజంగా శ్లాఘనీయమని ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శ్రీమతి రమ్యా రెడ్డి కొనియాడారు. ఈ పరంపరను కొనసాగించడంలో తమ వంతు సహాయం నిరంతరం అందిస్తామని డాక్టర్ లక్ష్మీ సౌజన్య తెలిపారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, దుర్గా వేషధారణ అత్యంత మనోరంజకంగా ఉన్నాయని శ్రీమతి మేరా ప్రభావతి, డాక్టర్ కె. సత్య శివ సుందరి, శ్రీ సూర్యనారాయణలు పేర్కొన్నారు.

చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. భారతీయ నృత్యం ప్రదర్శించిన విద్యార్ధినీ విద్యార్థులందరికీ వచ్చిన పుర ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విలేకరులు కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వెలిబుచ్చి చిన్నారులకు ప్రోత్సాహం అందించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సుధాకర్, శ్రీ మహేశ్వర రెడ్డి, కామనూరి మనోహర్ లతోపాటు సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్, శ్రీ సుందర రావు, శ్రీ అశోక్ కుమార్, శ్రీ రమణయ్య గౌడ్, శ్రీమతి విజయ శ్రీ, శ్రీమతి వెంకటేశ్వరి, అలాగే మాతృ మిత్ర సభ్యులు శ్రీమతి సంధ్య, శ్రీమతి జ్యోతి, శ్రీమతి మాధవి, శ్రీమతి శైలజ, శ్రీమతి సునంద, శ్రీమతి మహాలక్ష్మి లు పాల్గొన్నారు. అలాగే నంద్యాల పురప్రముఖులు, పలువురు సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.