
పుట్టుకతోనో, మధ్యలో మరే ఇతర కారణం చేతనో అంధత్వమో, అంగ వైకల్యమో వచ్చిన వారు కొందరు. మానసికమైన ఎదుగుదల లేక శరీరం ఎదిగిన, వయసొచ్చిన పసివాళ్ళు కొందరు. వేగలేక, వదల లేక, కన్న ప్రేమను చంపుకోలేక, మా తదనంతరం మా బిడ్డలకు దిక్కెవరు తండ్రీ అంటూ తల్లిదండ్రులు నిత్యం వేదన చెందుతూంటారు. అలాంటి వారికి మేమున్నామంటూ అండగా నిలబడుతోంది ‘సక్షమ్’ (SAKSHAM) “సమదృష్టి క్షమతా వికాస్ అనుసంధాన మండల్.”


విజయవాడలోని హైందవి భవనంలో ‘సక్షమ్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ ఒక రోజు సమావేశం సందర్భంగా ‘సక్షమ్’ అఖిలభారత సంయుక్త కార్యదర్శి శ్రీ గోవిందరాజ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వీఎస్కే ఆంధ్రప్రదేశ్, హిందూనగారా ప్రతినిధులు, మరి కొందరు పాత్రికేయ మిత్రులు వారిని కలిసి మాట్లాడటం జరిగింది. “ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ‘సక్షమ్’ దేశ వ్యాప్తంగా లెక్క లేనన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెబుతున్నారు స్వయంగా తాను అంధుడయిన శ్రీ గోవిందరాజ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘సక్షమ్’ యొక్క కార్యక్రమాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మొత్తం సంభాషణ ఆంగ్లంలో సాగింది.
వీఎస్కే : సార్ నమస్కారమండీ….
గో. రా : నమస్తే. రండి కూర్చోండి.
వీఎస్కే : సార్ అసలు ‘సక్షమ్’ అంటే ఏమిటి? ఎప్పుడు ప్రారంభమైంది? దేనికోసం పని చేస్తుంది?
గో. రా : ‘సక్షమ్’ 1993వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడు కేవలం చూపు లేని వారి కోసం పని చెయ్యడానికి ఇది ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 21 రకాల దివ్యాంగత్వాలను భారత ప్రభుత్వం గుర్తిచింది. అలాంటి వారందరి కోసం ‘సక్షమ్’ పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా 43 ప్రాంతాలలో, 350 జిల్లాలలో ‘సక్షమ్’ సేవలు కొనసాగుతున్నాయి. SAKSHAM అంటే “సమదృష్టి క్షమతా వికాస్ అనుసంధాన మండల్”. అంటే ఇందులో మూడు రకాల పనులుంటాయి. సమదృష్టి – దివ్యాంగుల పట్ల చులకన భావంతోనో, జాలితోనో కాకుండా వారిని కూడా మిగతా వారితో సమానంగా చూసేలా సమాజంలో పరివర్తన కోసం ప్రయత్నించడం. క్షమతా వికాస్ : దివ్యాంగుల యొక్క సామర్ధ్యం మెరుగుపడేలా, వారి పరిస్థితిలో ఎంతో కొంత మెరుగుదల సాధించేలా ప్రయత్నించడం. దానికి అవసరమైన శిక్షణ, వైద్య సహకారం అందించడం. వారిలోని నైపుణ్యాన్ని, ఆసక్తిని గుర్తించి వారికి అందులో శిక్షణ ఇవ్వడం. అనుసంధాన మండల్ : దివ్యాంగుల పరిస్థితులపైన, వారి దివ్యాంగత్వానికి కారణాలపైన, ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన పథకాలపైన అధ్యయనం చెయ్యడం. ‘ప్రణవ్’ పెరుతోమూగ, చెవిటి వారి కోసం పని జరుగుతోంది. ‘ప్రాణదా’ తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం పని చేస్తుంది. ‘కాంబా’ దృష్టి సమస్యలు ఉన్నవారి కోసం పనిచేస్తుంది. అలాగే, మానసిక ఎదుగుదల లేని వారి కోసం, కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం, మానసిక రోగుల కోసం ఇలా మొత్తం ఏడు విభాగాలలో ‘సక్షమ్’ పని చేస్తోంది. వీరందరికీ విద్య, వైద్యం అందించడం, వారి సామాజిక పురోగతికి, స్వావలంబనకి కృషి చెయ్యడం ‘సక్షమ్’ విధులు.

వీఎస్కే : ఇలా దివ్యాంగుల కోసం అనేక సంస్థలు పని చేస్తున్నాయి కదా? మళ్ళీ ‘సక్షమ్’ ఎందుకు? దీని ప్రత్యేకతలేమిటి?
గో. రా : దేశంలో దివ్యాంగుల కోసం పని చేస్తున్న ఇతర సంస్థలన్నీ ఏదో ఒక రకమైన దివ్యాంగత్వం ఉన్న వారి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. కానీ ‘సక్షమ్’ ఒక్కటే 21 రకాల దివ్యాంగుల కోసం క్రింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సమన్వయంతో పని చేస్తోంది. మహారాష్ట్ర లాతూర్ లో ‘సక్షమ్’ ఆధ్వర్యంలో ‘సంవేదన’ పేరుతో ఒక సంస్థ మానసిక దివ్యాంగుల కోసం పని చేస్తోంది. అలాగే నాగపూర్లో ‘మాధవ నేత్రాలయ’ పేరుతో నడిచే ఐ బ్యాంక్, మూగ, చెవిటి వారి కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కేంద్రంగా నడిచే ‘ప్రణవ్’, ముంబయిలో, బెంగళూరులో ఇలా అనేక చోట్ల వివిధ రకాలుగా దివ్యాంగులకు ‘సక్షమ్’ సేవలందిస్తోంది. అలాగే అనేక చోట్ల దివ్యాంగ బాల బాలికలు, స్త్రీ పురుషుల కోసం వసతి గృహాలను కూడా నిర్వహిస్తోంది. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.
వీఎస్కే : క్షేత్ర స్థాయిలో ‘సక్షమ్’ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి?
గో. రా : ‘కాంబా’ పేరుతో నేత్ర వైద్య సహకారం, నేత్ర దాన శిబిరాలు, ‘ప్రాణదా’ పేరుతో రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. స్కాలర్షిప్పులు, నెలవారీ రేషన్ కూడా కొందరికి అందిస్తున్నాం. అలాగే దివ్యాంగులకు ట్యూషన్లు చెప్పించడం, రీడర్స్ ని, పరీక్ష వ్రాసే వారిని ఏర్పాటు చెయ్యడం, అవసరమైన వారికి వైద్య సహాయం, కౌన్సిలింగ్ ఇప్పించడం, యోగ, మెడిటేషన్ తరగతులు నిర్వహించడం వంటివి రెగ్యులర్ గా ‘సక్షమ్’ నిర్వహించే పనులు. అలాగే దివ్యాంగులుగా వుండి గొప్ప ఘనతలు సాధించిన స్టీఫెన్ హాకింగ్ లాంటి వ్యక్తుల జయంత్యుత్సవాలు జరుపుతున్నాం. గొప్ప స్థానాన్ని, గౌరవాన్ని పొందిన మన పురాణ గాధల్లో కనిపించే మహాత్ములు కౌరవుల తండ్రి మహారాజు అయిన దృతరాష్ట్రుడు, సూర్యుని రథ సారథి అయిన అనూరుడు, మొట్టమొదటగా ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన వినాయకుడు, జనకుని మంత్రి అయిన అష్టావక్రుడు వంటి వారి వృత్తాంతాలు చెబుతూ ఉంటాం. దానివల్ల వారిలో ఆత్మ న్యూనత తొలగి ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. అలాగే సమాజంలో కూడా దివ్యాంగుల పట్ల చిన్న చూపు తొలగిపోతుంది. ‘సక్షమ్’ ఈ మొత్తం పనిని ఎలాంటి హడావుడి, ప్రచారార్భాటమూ లేకుండా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళుతోంది.
వీఎస్కే : క్షేత్ర స్థాయిలో ‘సక్షమ్’ చేస్తున్న పనులు వివరించారు. జాతీయ స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది?
గో. రా : ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయగారాజ్ లో జరిగిన కుంభమేళాలో ‘నేత్ర కుంభ్’ పేరుతో 7 ఎకరాల విస్తీర్ణంలో చాలా పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసి 50 రోజుల పాటు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో షుమారు 4 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అందులో అర్హులైన షుమారు ఒకటిన్నర లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించడం జరిగింది. ఇందులో 374 మంది నేత్ర వైద్యుల తోపాటు షుమారు 2500 మంది ఉచితంగా వివిధ సేవలను అందించారు. త్వరలో తిరువన్నామలైలో జరుగబోయే కార్తీక దీపోత్సవంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నాం.
వీఎస్కే : ఇన్ని రకాలైన సేవా కార్యక్రమాల నిర్వహణకు నిధులెలా వస్తున్నాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏమైనా లభిస్తోందా?
గో. రా : దివ్యాంగుల తోపాటు ‘దివ్యాంగ మిత్ర’ లను గుర్తించటం, వారి నుంచి సహకారాన్ని పొందటం కూడా ‘సక్షమ్’ పనిలో భాగమే. దివ్యాంగ మిత్రలు దివ్యాంగులకు భౌతికంగా, నైతికంగా, మానసికంగా, ఆర్ధికంగా తమ చేయూతనందిస్తారు. అలాగే మా కార్యక్రమాలు, సేవలు అట్టడుగు స్థాయి వరకు చేరుతూండడం చూసిన కొన్ని సంస్థల తోపాటు కొందరు వ్యక్తిగతంగా కూడా తమ సాయాన్నందిస్తున్నారు. ప్రభుత్వాలు కొన్ని పెద్ద కార్యక్రమాల నిర్వహణకు కొంత సహకారాన్ని అందిస్తున్నాయి కానీ సేవా కార్యక్రమాల నిర్వహణకు మేం ప్రభుత్వాల నుంచి ఆర్ధికంగా ఏమీ ఆశించటం లేదు.
వీఎస్కే : చివరి ప్రశ్న. ‘సక్షమ్’ సేవలు మన దక్షిణ భారతంలో ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆంధ్రలో?
గో. రా : కేరళ, కర్ణాటకలలో దాదాపు అన్ని జిల్లాలలో ‘సక్షమ్’ సేవలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో షుమారు 10 జిల్లాలలో ‘సక్షమ్’ కార్యకలాపాలున్నాయి. ఇక ఆంధ్రలో షుమారు 9 జిల్లాలలో ‘సక్షమ్’ యాక్టివిటీ ఉంది. గుంటూరులో తలసీమియా బాధితుల కోసం ‘ప్రాణదా’ ప్రాజెక్టు, విజయనగరంలో చెవిటి, మూగ వారి కోసం నిర్వహిస్తున్న స్పీచ్ థెరపీ సెంటర్ ఇలా రాష్ట్రంలో 7 చోట్ల దివ్యాంగ సేవా కేంద్రాలు నడుస్తున్నాయి. అనేక చోట్ల ఉచిత కౌన్సిలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. అలాగే ‘కాంబా’ పేరుతో నేత్ర దాన అవగాహనా కార్యక్రమాలు, ‘ప్రాణదా’ పేరుతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం.
ఈ విధంగా దివ్యాంగులకు ఉపకరించే అనేక రకాల కార్యక్రమాలను రూపొందించుకుంటూ, నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇందుకు కార్యకర్తలు అందరూ తమ సమయాన్ని వెచ్చించాలి. అవసరమైన సమయాల్లో తమ సహకారాన్ని అందించాలి. ఎందరో బాధితులు అనేక రకాల వ్యధలకు గురవుతున్నారు. వారందరినీ ఆదరించడం మనందరి కర్తవ్యం. శెలవు.
వీఎస్కే : ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు. నమస్కారం.





