
(నవంబర్ 1 – సిక్కుల నరమేధం మొదలైన రోజు)
స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య మరునాడే అంటే నవంబరు 1 నుంచి నాలుగు రోజుల పాటు సిక్కుల నరమేధం కొనసాగింది. సాయుధులైన దుండగులు దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులపై విరుచుకుపడ్డారు. ఆ హత్యాకాండలో 4 వేల మంది చనిపోయారని పలు సంస్థలు లెక్కలేసినా ఆ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంటారు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది చనిపోయారు. సిక్కులు కంటపడితే చాలు అల్లరిమూకలు రెచ్చిపోయి దాడులు చేశారు. పొట్టనపెట్టుకున్నారు. రోడ్డుమీదకు వచ్చిన సిక్కులనే కాదు..గురుద్వారాలు, సిక్కుల దుకాణాలు, ఇళ్ళను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్ళల్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డారు. సిక్కులు ప్రయాణిస్తున్న వాహనాలు కనపడితే చాలు పెట్రోల్ పోసి అంటించిన ఘటనలు ఎన్నో. సిక్కుల మెడలకు టైర్లు కట్టి సజీవదహనం చేశారు. నాటి ఘటనలతో బెంబేలెత్తిపోయిన దాదాపు 20 వేల మంది సిక్కులు ఢిల్లీ వదిలి వెళ్లిపోయారు. సర్వం కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీమతి రామ్ దులారి సిన్హా పార్లమెంట్‌లో 1985 జనవరిలో ఇచ్చిన సమాధానం ప్రకారం 16 రాష్ట్రాల్లో హింసాయుత సంఘటనలు జరిగాయి. వాటిల్లో 12 రాష్ట్రాల్లో హత్యలు జరిగాయి.
స్వతంత్ర భారతావనిలో చీకటి అధ్యయంగా నిలిచే ఈ నరమేధం వెనుక నాటి పాలకుల హస్తం సుస్పష్టంగా ఉందనేది నిర్వివాదాంశం. ఇందిరా గాంధీ పార్థివ దేహాన్ని ఉంచిన తీన్ మూర్తి వెలుపల జనం ‘ఖూన్ కా బద్లా ఖూన్’, ‘సర్దార్లు దేశద్రోహులు’ వంటి నినాదాలు వినిపిస్తున్నా ప్రభుత్వ అధికారులు ఎవరూ నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలో కర్ఫూ విధించార కానీ అమలైన దాఖలాల మాత్రం లేవు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కారు పై కూడా దుండగులు దాడి చేశారంటే అల్లర్లు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ ‘మై బ్లీడింగ్ పంజాబ్’ పేరుతో 1992లో ప్రచురించిన గ్రంథం ప్రకారం ఇందిరా గాంధీ హత్య జరిగిన రాత్రి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకులు ‘సిక్కులకు ఎప్పటికీ మరచిపోలేని గుణపాఠం ఎలా చెప్పాలో’ నిర్ణయించడానికి సమావేశం అయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. అసాంఘిక శక్తులను సమీకరించి సిక్కుల గృహాలు, వ్యాపార సముదాయాలను, వారి ప్రార్థనా మందిరాలను గుర్తించి వాటికి నిప్పు పెట్టారు. ఢిల్లీలో అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు, పారా మిలటరీ బలగాలు అసమర్థులు కాకపోయినా అందుకు సుముఖంగా లేరని కుష్వంత్ సింగ్ స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ సైతం సిక్కుల నరమేధాన్ని సమర్థిస్తున్నట్లుగానే మాట్లాడారు. సిక్కులను చంపి వారిని దోచుకోండి, ఏ సర్దార్‌ని తప్పించుకోనివ్వవద్దు అంటూ అల్లరి మూకలు పేట్రేగిపోతుంటే వారించాల్సింది పోయి, ‘ఒక బలమైన వృక్షం కూలినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం’ అంటూ అల్లర్లను సమర్థించారు. ఒక నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టు ప్రకారం, ఇందిరాగాంధీ హత్యతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిక్కులను లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిక్కుల ఇళ్లను గుర్తించగా..మూకలు వారిని హతమార్చడం ప్రణాళికాబద్ధంగా జరిగింది. అల్లర్లలో అట్టుడికిపోయిన త్రిలోక్‌పురిలో మూకను పోలీసులు స్వయంగా వాహనంలో తీసుకెళ్లి సిక్కుల ఇళ్ళ ముందు దిగబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హిందువులు తమ సిక్కు సహోదరుల పక్షాన నిలిస్తే వారినీ బెదిరించిన ఉదాహరణలున్నాయి.
సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఇప్పటివరకు పది కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మార్వా కమిషన్, మిశ్రా కమిషన్, కపూర్ మిట్టల్ కమిటీ, జైన్ బెనర్జీ కమిటీ, పొట్టి రోశ కమిటీ, జైన్ అగర్వాల్ కమిటీ, అహుజా కమిటీ, నరులా కమిటీ చివరిగా నానావతి కమిషన్. అల్లర్లపై చివరిగా దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్ 2005లో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిక్కులపై దాడులు కాంగ్రెస్ లేదా వారి మద్దతుదారులు లేదా కొన్ని ఇతర సంస్థలు లేదా సంఘాలచే నిర్వహించబడి ఉండవచ్చని స్పష్టం చేసింది. హత్యాకాండ జరిగిన 34 ఏళ్ల తర్వాత 2018లో ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ అల్లర్లకు సంబంధించి తాజాగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై నేరాభియోగం నమోదు చేసింది. ఏదిఏమైనా, 1984 సిక్కుల ఊచకోత ఆధునిక భారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటి. బాధ్యులను గుర్తించి జవాబుదారీ చేయాలి.





