
తమ కుటుంబాల గురించి మరచిపోయి, దేశ స్వాతంత్ర సాధనే లక్ష్యంగా గాంధేయ మార్గంలోకి వెళ్ళిన వారున్నారు. తమ చేతికి తగిలించిన సంకెళ్ళు రేపటి భరతమాత బానిస సంకెళ్ళు తొలగింపు కోసం అంటూ జైళ్ళకు వెళ్ళిన సామాన్య కుటుంబీకులు లెక్కలేనంత మంది. తమ జీవనాల గురించిన ఆలోచన లేదు. కుటుంబాల స్వార్థచింతన లేదు. స్వతంత్ర పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళటమే వారి లక్ష్యం. జైళ్ళలో మగ్గారు. కారాగారంలోనే కొత్త ఆలోచనలు చేసారు. శిక్ష పూర్తవగానే తిరిగి పోరాటంలో నిలిచారు. జైలు అధికారులు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత భయంకర పరిస్థితిని కల్పించినా మొక్కవోని ధైర్యంతో పోరాటాలను కొనసాగించారు. వాడవాడలా తమ గళం ఎత్తి ఉర్రూత లూగించారు. వారిలో ఒకరు కాదర్‌బాద్ నర్సింగరావు
నంద్యాల ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, అపరగాంధీ బిరుదాంకితుడు, నంద్యాల పట్టణాన్ని తీర్చిదిద్దిన మహనీయుడు కాదర్‌బాద్ నర్సింగరావు గారు.
మహాత్మాగాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలలో పాల్గొంటూ నంద్యాల పట్టణ ప్రజల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతా భావాన్ని పెంచడానికి ఎంతగానో శ్రమించారు. 1935 నుండి 1963 వరకు నంద్యాల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఏకఛత్రాధిపత్యం వహించారు.
1920 నుంచి 1934 వరకు నంద్యాల మునిసిపాలిటీకి చైర్మన్ గా పని చేసిన వీరు ఆ కాలంలో నంద్యాలను పారిశ్రామికంగా, విద్యా విషయకంగా, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దారు. సమాజ పురోగమనానికి విద్యే ప్రధానమని భావించిన వీరు నంద్యాలలో విద్యా వ్యాప్తి కోసం తన నాలుగెకరాల వ్యవసాయభూమిని ఉచితంగా ఇచ్చి 1916 – 17 న ఆరవ తరగతితో ప్రారంభించి 1921 – 22 న ఎస్.ఎస్.ఎల్.సి. వరకు తీసుకువచ్చారు. మునిసిపల్ హైస్కూల్ను నిర్మించేలా చేశారు. దానితో చదువుల కోసం విద్యార్థులు చిన్నతనంలోనే వేరే ప్రాంతాలకు పోయే బాధ తప్పింది. అనేక మంది విద్య పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. పూరిపాకలో ప్రారంభమైన ఆ పాఠశాల తరువాత రేకుల షెడ్లు, పటిష్టమైన భవనాల్లోకి నరసింగరావు గారు పురపాలక సంఘ అధ్యక్షులుగా వున్న సమయంలోనే శరవేగంగా పూర్తయింది. ఉత్తమమైన ఉపాధ్యాయులను వెదికి తీసుకొని వచ్చి మంచి నాణ్యమైన విద్యను పట్టణ వాసులకు అందేలా చూశారు.
కులమతాల కతీతంగా సమాజశ్రేయస్సును కాంక్షిస్తూ, కులవివక్షను నిరసిస్తూ అందరూ సమానమే అని చాటుతూ హరిజనుల కోసం 1940లో ఆత్మకూరు గ్రామంలో ఒక హాస్టల్‌ను ప్రారంభించారు. అనేక మంది చేస్తున్న విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని ఆ హాస్టలును విజయవంతంగా నడిపారు. ఆ తరువాత 1947లోహరిజన బాలుర కోసం, 1952లో హరిజన బాలికల కోసం… హాస్టళ్ళు నిర్మించేలా కృషి చేశారు. నంద్యాలలో విరాళాన్ని ఇవ్వడమే గాక అనేక మందితో విరాళాలు ఇప్పించేవారు. నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతో కాలం బాధ్యతలు నిర్వర్తించిన వీరు స్వాతంత్ర్యోద్యమకాలంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారితో కలిసి, వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ జాతీయోద్యమంలో క్విట్ ఇండియా, వ్యక్తి సత్యాగ్రహం మొదలగునవన్నీ విజయవంతంగా జరగడానికి కృషి చేశారు
వీరు ఖద్దరు బట్టలు ధరిస్తూ, పేదవారిపట్ల ప్రేమవాత్సల్యాలను ప్రదర్శిస్తూ హరిజనులతో కలసి సహపంక్తి భోజనాలు గావిస్తూ, వారిని సమాజంలో ఒక భాగంగా మారుస్తూ, ఎందరికో మార్గదర్శకులైనారు. అందుకే నంద్యాల ప్రాంత ప్రజలు వీరిని వురు ‘నంద్యాల గాంధీ’ అని అభిమానంగా పిలిచేవారు.
కోస్తా, రాయలసీమ ప్రజలమధ్య 1937లో ఏర్పడిన శ్రీభాగ్ ఒడంబడికపై 917. కర్నూలు ప్రాంతం నుంచి సంతకం చేసిన వారిలో కాదర్‌బాద్ నర్సింగరావు గారు కూడా వున్నారు. వీరు గాడిచెర్ల, కల్లూరు సుబ్బారావు గార్లతో కలిసి నంద్యాల ప్రాంతమంతా శ్రీభాగ్ ఒప్పందం గురించి వివరించడం జరిగింది. నంద్యాల ప్రాంతంలో అనేకమంది వీరిని రాజకీయగురువుగా భావించేవారు. ప్రధానమంత్రులు మొదలు సామాన్య కార్యకర్తల వరకు అందరూ వీరి ఆతిధ్యం స్వీకరించినవారే.
1963 జూన్ రెండవ తేదీన స్వర్గస్తులైన వీరు నంద్యాల ప్రాంత ప్రజలలో తమ విశిష్ట వ్యక్తిత్వం ద్వారా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అందుకే అక్కడి ప్రజలు, మునిసిపల్ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు వారి గౌరవార్ధం పాఠశాల ఆవరణలో 1983న నరసింగరావుగారి శిలావిగ్రహాన్ని శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్యగారి చేతుల మీదుగా ప్రతిష్ఠింప చేయడమే గాక మున్సిపల్ హైస్కూల్‌కు 2005లో కాదరాబాద్ నరసింగరావు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.





