
గుంటూరు జిల్లా తెనాలిలోని మారీసు పేటలోని చెంచురామానాయుడు పాఠశాలలో చదివే విద్యార్థులను అయ్యప్పదీక్ష దుస్తులు వేసుకుని రావడంపై హెడ్మాస్టర్ బషీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో విషయం తెలుసుకున్న పలు హిందూ సంఘాల ప్రతినిధులు, బిజేపి నాయకులు, అయ్యప్పభక్తులు పాఠశాల యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు రానివ్వకపోవడం దారుణమన్నారు. ఇది విద్యార్థులను ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. అయ్యప్ప దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన హెడ్మాస్టర్ బషీర్ క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అయ్యప్పస్వామి భజన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దిగివచ్చిన యాజమాన్యం సంబంధిత హెడ్మాస్టర్ బషీర్ తో విద్యార్థికి క్షమాపణ చెప్పించారు.





