News

హిందువులపై దాడులు జరిగితే సహించం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

34views

హిందువులందరూ ఐక్యంగా ఉంటూ, సమాజంపై దాడులు జరిగినప్పుడు సమష్టిగా స్పందించి భవిష్యత్తును కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా, అందరూ ఏకమై నిరసనలు, ఉద్యమాల ద్వారా సమర్థంగా ప్రతిఘటించాలని ఆయన సూచించారు.

గతంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ, పిప్రిలో ఒక హిందువు ఇంటిని తగులబెట్టినప్పుడు సమాజం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులపై చిన్న దాడి జరిగినా వేలాదిగా తరలివచ్చే పరిస్థితి ఉందని, హిందువుల్లోనూ అదే తరహా ఐక్యత రావాలని ఆకాంక్షించారు. హిందువులు సంఘటితంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై హిందువులపై జరిగే దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి మున్సిపాలిటీ తరఫున ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని రాకేశ్ రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫైలుపై సంతకం చేసిన వెంటనే, మందిరం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.