
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “గోరింటా పూసింది – మనసంతా నిండింది” అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి ఇందిరాదేవి తెలిపారు.
భారతీయ సంస్కృతిలో గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. పురాణ విశ్వాసాల ప్రకారం గోరింటాకు గౌరీదేవి అంశంగా పరిగణించబడుతుందని, అందువల్ల మహిళలు శుభకార్యాలు, పండుగలు, వివాహాలు, అట్లతద్ది వంటి ప్రత్యేక సందర్భాల్లో గోరింటాకును ధరించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయ పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగానూ ఉపయోగకరమని తెలిపారు. వర్షాకాలంలో చేతులు, కాళ్లు, గోర్లకు వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో గోరింటాకు సహాయపడుతుందని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడిందని వివరించారు.
భారతీయ వివాహ సంప్రదాయంలో కూడా గోరింటాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పెండ్లికుమార్తెకు గోరింటాకు పెట్టే ఆచారం కాలక్రమేణా నేటి “మెహందీ” కార్యక్రమంగా విస్తరించిందని పేర్కొన్నారు. గోరింటాకు అందానికి మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
గత ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లా కందుకూరు, కోనసీమ జిల్లా అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నంద్యాల జిల్లా మహానంది, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో గోరింటాకు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, మండల కేంద్రాల్లో ఉన్న బాలికల హాస్టళ్లలో గోరింటాకు కార్యక్రమాలు నిర్వహించాలని సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం నిర్ణయించింది. ఈ సందర్భంగా హాస్టళ్లలోని బాలికలకు గోరింటాకు పెట్టడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మహిళలు, సేవాభావం కలిగిన కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆడపిల్లలకు గోరింటాకు పెట్టి భారతీయ సంస్కృతి వైభవాన్ని పరిచయం చేయాలని ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి ఇందిరాదేవి పిలుపునిచ్చారు.
– సమరసత సేవా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం




