News

అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమం

45views

 

ఆధునిక సాంకేతిక విప్లవం ఎంత వేగంగా ముందుకు సాగినా, భావితరాలు ప్రపంచ పౌరులుగా ఎదిగినా భారతీయ సంస్కృతి, కళలే మన అసలు గుర్తింపని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కాకరపర్తి భావనారాయణ (కేబీఎన్) కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ గాయని డా. శోభారాజు పర్యవేక్షణలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి. శ్రీనివాసు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి చేరవేయడంలో డా. శోభారాజు విశిష్ట సేవలందిస్తున్నారని కొనియాడారు. నేటి సోషల్ మీడియా ప్రభావంతో యువతలో ఏకాగ్రత తగ్గుతున్న నేపథ్యంలో సంగీతం వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ప్రశాంతతకు, విలువల పెంపొందింపుకు ఉత్తమ సాధనమని పేర్కొన్నారు.

రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ, సంగీతం కేవలం భక్తి లేదా పోటీలకే పరిమితం కాదని, అది సహనం, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని అన్నారు. డా. శోభారాజు తన వద్దనున్న అన్నమయ్య సంకీర్తనల సంపదను నిస్వార్థంగా యువతకు అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ విద్యను అభ్యసించే విద్యార్థులు దానిని మరింత మందికి పంచాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

డా. శోభారాజు మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహంతో ఈ సేవ కొనసాగుతోందని పేర్కొంటూ, అన్నమయ్య కీర్తనలను ఆలపించడమే కాకుండా వాటిలోని జీవన సందేశాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.

కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి. శ్రీనివాసు మాట్లాడుతూ, డా. శోభారాజు గాత్రంలో అన్నమయ్య కీర్తనలు వినడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా నేటి తరానికి అన్నమాచార్యుల సాహిత్య, సంగీత వైభవంపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. మల్లిఖార్జునరావు రూపొందించిన అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, కేబీఎన్ కళాశాల అధ్యాపకులు చలపతిరావు రచించిన “పద్యభారతి” గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డా. వి. నారాయణరావు, కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కప్పగంతు రామకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.