
8views
ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.
ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. తాహిర్ హుస్సేన్, నజీమ్, ఖాసిం, అనాస్ మరియు జావేద్‌లను నిందితులుగా తేల్చింది. వీరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 165, 188, 153A, 147, 148 కింద నేరారోపణలు రుజువైనట్లు స్పష్టం చేసింది.
అయితే.. ఢిల్లీ అల్లర్లలో మరణించిన ఐబీ అధికారి అంకిత్ శర్మ కుటుంబం స్పందించింది. తన కుమారుడు హిందువు కాబట్టే, ఈ ఒక్క కారణంతోనే టార్గెట్ చేశారని పేర్కొంది. ఈ విషయంలో అతని ముస్లిం స్నేహితులు కూడా హంతకులతో చేతులు కలిపారని కుటుంబీకులు పేర్కొన్నారు.
2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మ మరణించారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా మతపరమైన హింస చెలరేగింది, ఇందులో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అంకిత్ కుటుంబం ఇప్పుడు ఖజూరీ ఖాస్‌లోని తమ పూర్వీకుల ఇంట్లో నివసించడం లేదు. భద్రతా ఆందోళనలు, చేదు జ్ఞాపకాల భారం కారణంగా అల్లర్లు జరిగిన వెంటనే వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు.
25 ఫిబ్రవరి 2020న అంకిత్ ఇంటి సామాగ్రి తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. పోలీసుల కథనం ప్రకారం, గుంపు ఆయనను కిడ్నాప్ చేసి, హత్య చేసి, మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. మరుసటి రోజు ఉదయం మురికి కాలువ నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో అంకిత్‌ను 52 సార్లు కత్తితో పొడిచినట్లు తేలింది. వీటన్నింటిని వినడం, గుర్తుచేసుకోవడం కుటుంబ సభ్యులకు ఎంతో కష్టంగా మారింది.
తన సోదరుడిని హిందువు అనే కారణంతోనే చంపేశారని అంకిత్ పెద్ద సోదరుడు అంకుర్ శర్మ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో అంకుర్ మాట్లాడుతూ, “మా సోదరుడు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అతని హత్యకు పాల్పడిన నిందితులందరికీ ఉరిశిక్ష పడాలి” అని డిమాండ్ చేశారు. ప్రతి గల్లీ దాటేటప్పుడు, ప్రతి మురికి కాలువను చూసేటప్పుడు పాత సంఘటన గుర్తుకొచ్చేదని, గుండె బరువెక్కేదని అంకుర్ చెప్పారు. అందుకే ఆ స్థలాన్ని వదిలిపెట్టి కుటుంబమంతా అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించామని తెలిపారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అంకిత్ అందరితో కలిసిపోయే మనస్తత్వం గల వ్యక్తి. ఆయనకు హిందూ, ముస్లిం రెండు వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన మనసులో ఎవరిపట్లా ఎలాంటి వివక్ష ఉండేది కాదు. కానీ దాడి జరిగినప్పుడు ఆయన కొంతమంది ముస్లిం స్నేహితులు కూడా హంతకులతో చేరడం కుటుంబ సభ్యులను మరింతగా కుంగదీస్తోంది.
అంకిత్ మరణం ఆ కుటుంబంపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆయన తల్లిదండ్రులు హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు. అల్లర్లు లేదా ఈ కేసుకు సంబంధించిన చర్చలు జరిగినప్పుడల్లా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిందితులందరికీ ఉరిశిక్ష లేదా కఠినాతికఠినమైన శిక్ష పడినప్పుడే తమకు పూర్తి న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు.




