News

వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే

36views

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం  ‘వందేమాతరం’కూ వర్తింపజేసేలా ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’ (Prevention of Insults to National Honour Act, 1971)లో సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రతిపాదిత సవరణ అమల్లోకి వస్తే జాతీయ గీతం, జాతీయ గేయాన్ని అవమానించేలా వ్యవహరించిన సందర్భాల్లో ఒకే విధమైన నిబంధనలు వర్తించనున్నాయి. ప్రస్తుతం జాతీయ చిహ్నాలు, జాతీయ గీతానికి సంబంధించిన అవమాన నిరోధక నిబంధనలు ఈ చట్టం పరిధిలో ఉన్నాయి.

జాతీయ గీతం, జాతీయ గేయం పట్ల గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. చట్ట సవరణ జరిగితే ఉల్లంఘనలకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు శిక్ష, జరిమానా విధించే నిబంధనలు వర్తించే అవకాశం ఉంది.

ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’లోని నిర్ణీత పంక్తులను వినియోగించడంపై మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఆలపించాల్సిన సందర్భాల్లో జాతీయ గేయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

అయితే గతంలో జాతీయ గేయం ఆలాపనకు సంబంధించిన మార్గదర్శకాలు తప్పనిసరి నిబంధనలు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వందేమాతరానికి చట్టపరమైన హోదా, రక్షణ కల్పించేందుకు కేంద్రం చట్ట సవరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.