News

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి

123views

– తిరుమలలో  శాస్త్రోక్తంగా  రథసప్తమి
– ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్య హృదయం, ‘సూర్యాష్టకం’

సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారం రోజు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. కొవిడ్‌ తర్వాత మొదటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న రథసప్తమి వాహనసేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. ఈరోజు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.50 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుంచి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. వారి గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల శ్లోకాలు..
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చ‌దుకుంటున్న 100 మందికి పైగా విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం త‌దిత‌ర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

 

Leave a Response