News

“శాఖాహార పాల ఉత్పత్తులకు హలాల్ అవసరమా ?”

5views

మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం — ప్రజల్లో ‘గోకుల్’గా ప్రసిద్ధి చెందిన ఈ పాల ఉత్పత్తిదారుల సంఘం తయారు చేసే నెయ్యి, వెన్న, పాల పొడి వంటి ఉత్పత్తులకు ‘హలాల్’ ధృవీకరణ మంజూరైన విషయం బయటకు రావడంతో హిందూ సమాజంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధృవీకరణ పత్రం ప్రకారం, ఈ సర్టిఫికేషన్ 19 మార్చి 2025 నుంచి 18 మార్చి 2028 వరకు చెల్లుబాటు కానుంది.

“శాఖాహార పాల ఉత్పత్తులకు హలాల్ అవసరమా ?”
సాధారణంగా ‘హలాల్’ భావన మాంసాహార ఉత్పత్తులతో సంబంధం కలిగినదిగా భావించబడుతున్న నేపథ్యంలో, పూర్తిగా శాఖాహారమైన పాల ఉత్పత్తులకు కూడా హలాల్ ధృవీకరణ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న హిందూ వినియోగదారులు మరియు హిందుత్వ సంస్థల నుంచి తీవ్రంగా వినిపిస్తోంది. “ఇది కేవలం వ్యాపార అవసరమా ? లేక హలాల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నమా ?” అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.

విమర్శకుల ఆరోపణల ప్రకారం, వైద్య విద్యాశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ కుమారుడు నవీద్ ముష్రిఫ్ ‘గోకుల్’ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోబడింది.

ఈ వివాదంపై స్పందించిన మంత్రి హసన్ ముష్రిఫ్ మాట్లాడుతూ, “ఈ ధృవీకరణ కొత్తది కాదు; 2022 నుంచే అమల్లో ఉంది. గోకుల్ ఉత్పత్తులు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, టర్కీ, జోర్డాన్, సిరియా వంటి దేశాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి. ఆ దేశాల నిబంధనల ప్రకారం హలాల్ ధృవీకరణ తప్పనిసరి కావడంతో ఇది పొందబడింది” అని తెలిపారు.

‘హలాల్’ ధృవీకరణ అంటే ఏమిటి ?
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ‘హలాల్’ అంటే “అనుమతించబడినది” లేదా “మతపరంగా సమ్మతించబడినది” అనే అర్థం. గతంలో ఇది ప్రధానంగా మాంస ఉత్పత్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ప్రస్తుతం ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలు, గృహోపకరణాలు తదితర అనేక ఉత్పత్తులకు కూడా ఈ ధృవీకరణ పొందుతున్నారు.

హలాల్ ధృవీకరణకు మద్దతుదారులు దీన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణంగా మరియు ముస్లిం వినియోగదారుల మతపరమైన అవసరాల పరిరక్షణగా పేర్కొంటున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం, “హలాల్ ధృవీకరణ పేరుతో ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను బలపరచే ప్రయత్నం జరుగుతోంది” అని ఆరోపిస్తున్నారు.