193
శ్రీకాకుళం(అరసవిల్లి): శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలలో వేచి చూశారు. మరోవైపు అర్ధరాత్రి దాటిన తర్వాత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించిన అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా శనివారం సూర్యోదయం తర్వాత సూర్యుడి తొలి కిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకాయి. ఈ అపురూప క్షణాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.