ArticlesNews

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?

448views

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు. ఆయా విశేషాలను తెలియజేసేలా గణతంత్ర దినోత్సవం సందర్బంగా వీఎస్‌కే ప్రత్యేక కథనం..

రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు తొలి అడుగు..
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు తొలుత రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఏర్పాటైన వ్యవస్థ. బ్రిటిష్ పార్లమెంటు నుంచి అధికార మార్పిడి కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించాలని భావించారు. దానికోసమే రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. ఈ పరిషత్తు సభ్యులను ఆనాటి ప్రొవిన్షియల్ అసెంబ్లీలు దామాషా ప్రాతిపదికన బదలాయింపు ఓటు పద్ధతి ద్వారా ఎన్నుకున్నాయి. అదే మన దేశపు మొట్టమొదటి పార్లమెంటు.. రాజ్యాంగ పరిషత్ తొలి ఛైర్మన్ గా రాజేంద్రప్రసాద్ ను ఎన్నుకున్నారు. పరిషత్ మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఆ సమావేశం జరిగిన కాన్స్టిట్యూషన్ హాలు ఇప్పుడు పార్లమెంటులో సెంట్రల్ హాల్ అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ఆ సమావేశానికి హాజరై, తమ వివరాలు సమర్పించిన వారు 207 మంది. డిసెంబర్ 1947 నాటికి పరిషత్తులో 299 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 229 మంది 12 భారతీయ ప్రోవిన్సుల నుంచి ఎన్నికైన వాళ్ళు, మిగతా 70 మంది ఆనాటి రాజ సంస్థానాలు నామినేట్ చేసిన అభ్యర్థులు. ఆ అసెంబ్లీలో 15 మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఏదైనా అంశంలో సభ్యులు ఏవైనా సవరణలు ప్రతిపాదించాలంటే ముందుగా రాతపూర్వకంగా పరిషత్ చైర్మన్ కి అందజేయాలి. ఆ అంశంపై చర్చలు సుదీర్ఘంగా జరిగేవి. పరిషత్తు సుమారు మూడేళ్ళపాటు మనుగడలో ఉంది. 1947లో దేశానికి స్వాత్రంత్య్రం వచ్చాక మొదటి పార్లమెంటు సమావేశాలు జరిగేవరకూ పరిషత్తు ఉనికి కొనసాగింది. పరిషత్ సభ్యుల ఎన్నిక సాధారణ వయోజనుల ప్రాతిపదికన జరగలేదు. ముస్లింలు, సిక్కులకు మైనారిటీల పేరిట ప్రత్యేక ప్రాతినిథ్యం లభించింది. పరిషత్ ఏర్పాటును అడ్డుకోడానికి తీవ్రంగా ప్రయత్నించిన ముస్లిం లీగ్ ను పరిషత్తును బహిష్కరించింది. మరోవైపు పరిషత్‌ సభ్యులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వారే. అప్పటికీ ఆ ఒక్క పార్టీయే ఎక్కువగా ఉండేది. కానీ వైవిధ్యమైన భావజాలాలకు చోటు ఉండేది. సంప్రదాయిక పారిశ్రామికవేత్తల నుంచి తీవ్రవాద మార్క్సిస్టుల నుంచి హిందూ పునరుజ్జీవవాదుల వరకూ అన్నిరకాల భావజాలాల వారూ పరిషత్తులో ఉన్నారు. ఇక చివరికి పరిషత్తులో మొత్తం సభ్యులు 389 మంది. వారిలో 292 మంది రాష్ట్రాల ప్రతినిథులు, 93 మంది రాజ సంస్థానాల ప్రతినిథులు, మిగతా నలుగురూ ఢిల్లీ, అజ్మేర్ మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ అనే నాలుగు చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ ల ప్రతినిథులు ఉండేవారు. రాజ్యాంగ పరిషత్ అవిభక్త భారతదేశం కోసం ఏర్పాటైంది. ఆ పరిషత్తు 1946 డిసెంబర్ 9న మొదటిసారి సమావేశమైంది. మలి సమావేశం 1947 ఆగస్టు 14న జరిగింది. అప్పటికి అది సార్వభౌమ సంస్థగా, భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు అధికారానికి వారసురాలిగా గుర్తింపు పొందింది. దేశ విభజన ఫలితంగా, మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 1947 జూన్ 3న పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకంగా ఏర్పాటయింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించాలన్న లక్ష్యాన్ని రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల్లో సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది. దీని రూపకల్పన సమయంలో 395 అధికరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళతో ఉండేది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 అధికరణాలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. నేటివరకూ మన రాజ్యాంగానికి 101 సవరణలు జరిగాయి. 1947 ఆగస్టు 14 నాటి అజెండాలో మొదటి అంశం ‘వందేమాతరం’ గీతం మొదటి చరణం పాడడం, అందరూ లేచి నిలబడి వినడం. వందేమాతర గీతపు తొలి చరణాన్ని శ్రీమతి సుచేతా కృపలానీ పాడారు. పరిషత్ అధ్యక్షుడు తన ప్రసంగాన్ని హిందుస్తానీ భాషలో వెలువరించారు. ఆ ప్రసంగం పూర్తి పాఠం హిందుస్తానీ ఎడిషన్ లో ప్రచురితమయింది.

రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న మహిళ – హంసా మెహతా
హంసా మెహతా భారతదేశపు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్. ముంబయిలోని ఎస్.ఎన్.డి.టి విశ్వవిద్యాలయానికి రెండేళ్ళపాటు వైస్ ఛాన్సలర్ గా పని చేశారు. ఈమె చేసిన సేవలు అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతిగాంచాయి. మహిళల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి సబ్ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్తులో హంసా మెహతా 1946 నుంచి 1949 వరకూ మూడేళ్ళ పాటు పనిచేశారు. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్ స్టిట్యూషనల్ కమిటీ, సలహా సంఘాల్లో ఆమె సభ్యురాలుగా పనిచేశారు. 1947 ఆగస్టు 15 అర్థరాత్రి తర్వాత ‘భారత మహిళలు’ అందరి తరఫునా పరిషత్తుకు భారత జాతీయ పతాకాన్ని అందించే అరుదైన గౌరవం హంసా మెహతాకు దక్కింది. స్వతంత్ర భారతదేశంలో ఎగిరిన మొట్టమొదటి జెండా అదే కావడం విశేషం. ఆమె గొప్ప విద్యావేత్త, రచయిత్రి, స్త్రీవాది, సంస్కరణవాదిగా పేరు గడించారు. విద్యావేత్తగా ఆమె బాలబాలికల చదువు కోసం పోరాడారు. హోంసైన్సెస్ కి విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశం హోదా కల్పించారు. సమాజ సేవ అంశంపై ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూలే ప్రారంభించారు.

హంసా మెహతా సూచనలు ఇవే..
”రాజ్యాంగంలో ఎక్కడా మైనారిటీలను నిర్వచించలేదని.. మన ముందరి పాలకులు ఇచ్చిన నిర్వచనాన్నే మనం ఆమోదించాము. కానీ వాళ్ళు ప్రజలను ‘విభజించి పాలించాల’న్నతమ విధానానికి అనుగుణంగా మతపరమైన మైనారిటీలను పుట్టించారు. ఆ విధానం ఈ దేశాన్ని విభజించి రెండు ముక్కలు చేసింది. ఈ దేశాన్ని మరిన్నిముక్కలు చేయడం మనకెంతమాత్రం వద్దు. అసలు మైనారిటీలకు ఏం కావాలి? వాళ్ళ ఆకాంక్షలేమిటి? భారత రాజ్యాంగం అందరికీ సమన్యాయం, సమాన స్థాయి, సమాన అవకాశాలు కచ్చితంగా కల్పిస్తోంది. మతపరమైన హక్కులు కూడా కల్పించింది. మైనారిటీలకు ఇంతకంటె ఏం కావాలి? వారికి అధిక ప్రాధాన్యత కావాలా, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. వాళ్ళు విశేషాధికారాలు కావాలని అడగలేరు. అయితే దీని నుంచి కేవలం షెడ్యూల్డు కులాల వారికి మాత్రం మినహాయింపు ఇవ్వవచ్చునని నా ఉద్దేశం” అని హంసా మోహతా తెలిపారు. సభ దృష్టికి ఆమె మరో అంశాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఒకే పౌర స్మృతి ఉండడం ఎంతో అవసరమని.. అయితే ఆ పౌరస్మృతి భారత దేశంలోని అన్ని పురోగామి చట్టాల కంటె గొప్పగానో, కనీసం వాటితో సమానంగానైనా ఉండాలని సూచించారు.

 

భారత రాజ్యాంగంపై హిందూ ముద్రలు..
భారత రాజ్యాంగంలోని ప్రతీ భాగంలోనూ పొందుపరిచిన చిత్రాలకు వాటి సొంతమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. కేంద్రం, దాని పరిధిని చర్చించే మొదటి భాగం మొహెంజొదారో ముద్రతో మొదలవుతుంది. ఆ ముద్ర మీది ఎద్దు చిహ్నం భారతదేశంలో సంప్రదాయికంగా జరిగే గోపూజను ప్రతిబింబిస్తుంది. పౌరసత్వానికి సంబంధించిన రెండో భాగం వైదిక సంప్రదాయమైన యజ్ఞంతో ప్రారంభమవుతుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన మూడో భాగం లంకా విజయాన్ని చూపే చిత్రంతో మొదలవుతుంది. చెడుమీద ఎప్పటికైనా మంచే గెలుస్తుందన్న సంకేతమది. ఇక నాలుగో భాగం ఆదేశ సూత్రాలను వివరిస్తుంది. ఆ భాగం శ్రీకృష్ణ భగవానుడి గీతాబోధనకు చెందిన చిత్రంతో మొదలవుతుంది. ఇక ఐదవ భాగం బుద్ధుడు స్థాపించిన సంఘానికి సంబంధించిన చిత్రంతో ప్రారంభమవుతుంది. రాష్ట్రాలకు సంబంధించిన ఆరవ భాగంలో మహావీర తీర్థంకరుడి బొమ్మ ఉంది. అలాగే పన్నెండవ భాగంలో నటరాజ మూర్తి దర్శనమిస్తాడు. భారత రాజ్యాంగపు తాత్వికత నేపథ్యంలో భారతీయ సంస్కృతి వారసత్వాలతో ఈ చిత్రాలకు ఉన్న బంధం ఎవరూ కాదనలేనిది.

స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన సమకాలీన మహానేతల చిత్రాలు రెండే రెండు మాత్రమే రాజ్యాంగంలో పొందుపరిచారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీవి రెండు చిత్రాలున్నాయి. ఒకటి దండి యాత్రను చూపేది కాగా రెండోది నౌఖాలీ సందర్శనకు సంబంధించినది. మరో చిత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది. (భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నేతాజీ బోస్, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్రను తెలిపే చిత్రమది). ఇద్దరు వివాదాస్పద ముస్లిములు అక్బర్, టిప్పు సుల్తాన్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగం మూలప్రతిలోని చేతిరాత ప్రేమ్ బిహారీ నారాయణ్ రయీజ్దా రాత. నందలాల్ బోస్ వంటి చిత్రకారులు చిత్రాలకు రూపకల్పన చేశారు.