
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7 న నాసిక్ పోలీసులు ఛత్రపతి శంభాజీ నగర్ లో అరెస్ట్ చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్, సిట్ బృందం సమాచారం మేరకు, ఛత్రపతి శంభాజీ నగర్ పోలీసుల సహాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లోనే ఆమె అరెస్ట్ అయ్యారు. దీంతో పోలీసులు శుక్రవారం ఆమెను నాసిక్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
అయితే నిదా ఖాన్ కి ఇన్ని రోజుల పాటు ఆశ్రయం ఎవరిచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM) ప్రముఖ నేత ఇంతియాజ్ జలీల్ కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది.
నాసిక్ లోని టీసీఎస్ లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నట్లు నిదా ఖాన్ పై ఆరోపణలున్నాయి. అక్కడి ఉద్యోగులు కూడా నిదా ఖాన్ చేసిన పనులను వెలుగులోకి తెస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిదాఖాన్ పరారీలో వున్నారు. గత 25 రోజులుగా ఆమెఅజ్ఞాతంలో ఉన్నారు.ఈమెను పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి, విస్తృతంగా గాలించారు.
మరో వైపు ఈ కేసు దర్యాప్తు కోసం నాసిక్ పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. టీసీఎస్ క్యాంపస్ లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్లకు సంబంధించి మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మేనేజర్ సహా 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే నిదాఖాన్ పేరు బయటికి వచ్చింది. కంపెనీలో సీనియర్ అయిన నిదాఖాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, వేధింపులకు దిగుతోందని తెలిసిపోయింది.
ఇస్లాం సిద్ధాంతాలనే అనుసరించాలి, ఆ మతానికి సంబంధించిన దుస్తులే ధరించాలని మహిళా ఉద్యోగులను పదే పదే వేధించేదని, బలవంతపెట్టేదని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు తీవ్రత పెరిగిపోవడంతో నిదాఖాన్ పరారీలో వుంది.చివరికి ఛత్రపతి శంభాజీనగర్ లో ఆమె ఆచూకీని గుర్తించి, అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే…
మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు తీవ్ర కలకలం రేపాయి. దీంతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం కూడా ప్రకటించింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను సహించమని తేల్చి చెప్పింది.
నిజానికి టీసీఎస్ బీపీఓ జిహాద్ కేసు కార్పొరేట్ దర్యాప్తులలో ఒకటిగా వేగంగా విస్తరించింది. మొదట ఇదొక మామూలు ఫిర్యాదులా కనిపించినా, రానూ రానూ పెద్దదైంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య కాలంలో ఏకంగా తొమ్మిది ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.
ఇప్పటివరకు, మహారాష్ట్ర పోలీసులు డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మేమన్, షారుఖ్ ఖురేషి, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్ మరియు అశ్విని చనానిని అరెస్ట్ చేశారు. వీరిలో నిదా ఖాన్ పరారీలో వుండగా.. మిగిలిన వారందరూ పోలీసుల అదుపులోనే వున్నారు. అలాగే ఈ కేసు తీవ్రత దృష్ట్యా సిట్ కూడా ఏర్పాటైంది.
నిజానికి ఏం జరిగిందంటే.. పోలీసుల వివరాల ప్రకారం నాసిక్ క్యాంపస్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి మరో ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు కూడా స్పందించి, తమపై కూడా వేధింపులు జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హెచ్ఆర్ మేనేజర్ సహా అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషీ, రజా మేమన్, తౌసిర్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి ఈ నెల ఫిబ్రవరి వరకు వర్కింగ్ స్థలంలో వీరులైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి వారంతా చేశారని పేర్కొన్నారు. తాము ఫిర్యాదు చేసినా.. యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు.




