News

తిరుపతి శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారయాత్ర

4views

లోకకల్యాణార్ధం, ధర్మజాగృతి లక్ష్యంగా మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని ధర్మ ప్రచార యాత్ర హైదరాబాద్‍లో అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వేలాదిమంది భక్తులు, పరిపూర్ణ సమర్పణ భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహంతో సనాతన ధర్మ పరిమళాలను వెదజల్లుతూ సాగిన ఈ యాత్ర విశాఖపట్నంలోని ఆధ్యాత్మిక తరంగాల నుంచి రాజమహేంద్రవరంలోని గోదావరి తీర పవిత్రత మీదుగా భాగ్యనగరిలోని భక్తజనుల కోలాహలం మధ్య పరిసమాప్తమైంది. ఈ విషయాన్ని మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వెల్లడించారు.

ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని ప్రతి భక్తుని హృదయంలోనూ, వారి అంతరంగంలోనూ ధర్మాన్ని మేల్కొలిపే ఓ మహాయజ్ఞం అని రమ్యానంద భారతీ స్వామిని అన్నారు. నారీ ఏవ నారాయణీ అన్న సూక్తిని స్మరిస్తూ ప్రతి ఇంటిలోనూ ధర్మం ఆచరణలో ఉండాలని ఈ సందర్భంగా మాతాజీ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికశక్తి వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు రమ్యానంద భారతి వివరించారు. ప్రతి వ్యక్తి తన బాధ్యతను ధర్మబద్ధంగా నిర్వర్తించాలని మాతాజీ అందరికీ పిలుపునిచ్చారు.

భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణ : ఈ యాత్రను విజయవంతం చేసిన భక్తకోటికి శుభాశీస్సులు అందించారు. ఈ కార్యక్రమం కోసం అహర్నిశలు శ్రమించిన శ్రీశక్తి పీఠం సిబ్బంది, కార్యకర్తలు, నిర్వాహకులను మాతాజీ ఘనంగా సత్కరించారు. వాళ్లందరికీ ఎల్లప్పుడూ తమ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ధర్మ ప్రచార కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ నగరంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మమేకమై భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణ కల్పించినట్లు శ్రీ శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని తెలిపారు. మాతాజీ దివ్య సన్నిధిలో విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.

శ్రీశక్తి పీఠం నుంచి ప్రారంభమైన ధర్మ ప్రచార యాత్ర భాగ్యనగరానికి చేరుకున్నట్లు మాతాజీ పేర్కొన్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల మార్గదర్శకత్వంలో ముందుకు కొనసాగుతూ ధర్మ బోధన, ధర్మ సంస్థాపన కోసం పాటుపడుతున్నట్లు రమ్యానంద భారతీ స్వామిని ప్రవచించారు. తమను కొలిచే భక్తులకు మార్గనిర్దేశకత్వం చేయడం పీఠాధిపతుల ప్రథమ కర్తవ్యమని మాతాజీ చెప్పారు. గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున భక్తులకు మంత్రోపదేశ కార్యక్రమం నిర్వహించినట్లు మాతాజీ వెల్లడించారు. ట్యాంక్‍బండ్‍ వద్ద నిన్న జరిగిన అన్నమాచార్య జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ధార్మిక సందేశం ఇచ్చినట్లు తెలిపారు.

పీఠాధిపతుల కర్తవ్యంలో ధర్మ ప్రచార యాత్ర : భక్తులు కోరారు కనుక వాళ్ల కోసమే వచ్చానని రమ్యానంద భారతీ స్వామిని అన్నారు. వందలాది కాదు వేలాది మంది దర్శనానికి వచ్చారని మంత్రోపదేశం తీసుకున్నారని మాతాజీ ప్రభోదించారు. వాళ్లంతా మార్గనిర్దేశనం కోరుకున్నారని వారికి తగినటువంటి సూచనలు చేయడం జరిగిందని మాతాజీ వివరించారు. సన్యాసులు, పీఠాధిపతుల కర్తవ్యంలో ధర్మ ప్రచార యాత్ర అనేది ప్రధానమైందని మాతాజీ ప్రభోదించారు. పీఠాలలో వాళ్లు ఉన్న చోటుకి భక్తులు వస్తారని అయితే భగవంతుడు ఎలా భక్తుల వద్దకు వచ్చి అనుగ్రహిస్తారో అలానే పీఠాధిపతులు కూడా చేయాలని రమ్యానంద భారతీ స్వామిని అన్నారు.

వేంకటేశ్వర స్వామి తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్లాలనే సందేశాన్ని ఇచ్చారని మాతాజీ వ్యాఖ్యానించారు. జగద్గురువు శంకరాచార్యులు ఎలా అయితే ధర్మ ప్రచార యాత్రను దేశమంతా చేశారో అలానే తాము ఈ ధర్మ ప్రచార యాత్రను చేపట్టామని శ్రీశక్తి పీఠాధిపతి వివరించారు. శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో బీబీనగర్ ప్రాంతంలో భైరవిపురి పేరిట మరో దేవాలయ నిర్మాణం జరగనున్నట్లు వెల్లడించారు. దేవాలయం పూర్తైన తర్వాత భక్తులతో అంతా దర్శించుకోవాలని రమ్యానంద భారతీ స్వామిని భక్తులకు పిలుపునిచ్చారు.