News

ఓ వైపు నషాముక్త్ జమ్మూ..మరో వైపు ఇస్లామిక్ సానుభూతి పరుల తొలగింపు..

10views

కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చేయూతనిస్తున్న ఉద్యోగులకు భారీ షాక్ తగులుతోంది.అలాంటి వారిని గుర్తించి, వెంటనే ఉక్కుపాదం మోపుతున్నారు ఎల్జీ మనోజ్ సిన్హా.

తాజాగా మనోజ్ సిన్హా మరో విషయంపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే మాదక ద్రవ్యాలపై. ‘‘నషా ముక్త్ జమ్మూ కశ్మీర్’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతనాగ్ జిల్లా పోలీసు యంత్రాంగం, ఇతర పోలీసుల సమన్వయంతో మాదక ద్రవ్యాల విక్రేతలే లక్ష్యంగా చేసుకొని, దాదాపు ప్రతిరోజూ కఠినమైన చర్యలకు దిగుతున్నారు. NDPS చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు అమ్ముతున్న వారే లక్ష్యంగా, వారి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. తాజాగా బిజ్ బెహారాలోని వాఘమాలో కూల్చివేతలు జరుగుతున్నాయి.

ఎలాంటి రాజకీయ చిక్కులు, చట్టపరమైన చిక్కులు రాకుండా, జాగ్రత్తగా అలాంటి భవనాలను గుర్తిస్తోంది సర్కార్. కూల్చేయడానికి సిద్ధమైన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.మాదక ద్రవ్యాలను విక్రయించడం ద్వారానే వచ్చిన ఆదాయంతో ఈ భవంతులను నిర్మిస్తున్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. అందుకు తగ్గ సాక్ష్యాధారాలను కూడా పోలీసు శాఖ సిద్ధం చేసి వుంచింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ, పట్టుబడినా, ఏమాత్రం మారలేదని పోలీసు శాఖ పేర్కొంటోంది.

పోలీసు సిబ్బంది, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతను నిర్వహిస్తున్నారు. వాఘమా ప్రాంతంలో ప్రభుత్వ భూమికి సంబంధించి, పచ్చిక బయళ్లలో అక్రమంగా నిర్మించిన 15 దుకాణాలను కూల్చేశారు.మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం (NDPS Act) కింద నమోదైన కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు సంబంధించినవని పోలీసులు ధ్రువీకరించారు.

మరో వైపు ఈ భూములన్నింటినీ రెవిన్యూ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. కొన్ని రోజుల్లోనే ‘‘ఈ భూములన్నీ ప్రభుత్వ భూములే’’ అని బోర్డులు పెట్టేస్తామన్నారు.జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను, వాటి ఆర్థిక మరియు భౌతిక మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో చేపట్టిన “నషా ముక్త్ జెకె” ప్రచారంలో భాగంగా జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమని అధికారులు తెలిపారు. మూడు వారాల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలో ఒక భారీ ర్యాలీతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.

దీంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి వెన్నులో వణుకు ప్రారంభమైంది. అటు పోలీసులకు కూడా ఎల్జీ మనోజ్ సిన్హా పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పోలీసులు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దీంతో మాదక ద్రవ్యాల ద్వారా డబ్బును ఆర్జించి, వివిధ రూపాల్లో సొమ్ము చేసుకున్న వారు ఇప్పుడు తీవ్రంగా భయపడుతున్నారు.

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న వారిపైనా కఠిన చర్యలు…

మరో వైపు ఎల్జీ మనోజ్ సిన్హా మరో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో వుంటూ ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న వారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నారు. ఈ యేడాది ఏప్రిల్ మాసంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సీ) కింద ఈ చర్య తీసుకుంది. విద్యా శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా వున్న ఫర్హత్ అలీ ఖండే, బందిపోరాలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మహ్మద్ షఫీదార్ ను ప్రభుత్వం తొలగించింది.

ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయబా, హిజ్బుల్ ముజాయుద్దీన్ తో సంబంధాలు ఏర్పర్చుకున్నారు. దీంతో పాటు ఆ సంస్థలకు నిధులు సమకూర్చడం, లాజిస్టికల్ మద్దతివ్వడం, సున్నిత సమాచారాన్ని వారితో పంచుకోవడం వంటి పనులను వీరు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఇక ఇదే యేడాది జనవరి మాసంలోనూ ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఎల్జీ సస్పెండ్ చేశారు.

ఒకరు ఉపాధ్యాయుడు. ఈయన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయ్యబా కోసం పనిచేస్తున్నాడు.

మరో ఉద్యోగి ల్యాబ్ టెక్నీషియన్. హిజ్బుల్ ఉల్ ముజాహిదీన్ తో సంబంధాలు నెరుపుతున్నాడు.

మూడో వ్యక్తి అసిస్టెంట్ లైన్ మేన్. LeT తో సంబంధాలు కలిగి వున్నాడు.

నాలుగో వ్యక్తి అటవీ శాఖ ఉద్యోగి, అలాగే ఆరోగ్య వైద్య విద్యా శాఖలో పనిచేస్తున్న డ్రైవర్ సస్పెండ్ అయిన వారిలో వున్నాడు.

ఇక.. గత యేడాది ఆగస్టు మాసంలో కర్నా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గొర్రెల పెంపకం విభాగంలో అసిస్టెంట్ స్టాక్ మేన్ గా వున్న సియాద్ అహ్మద్ ఖాన్ ను విధుల నుంచి తొలగించారు. వీరు ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నారు.

గత యేడాది జూన్ మాసంలో కూడా ముగ్గుర్ని విధుల నుంచి తొలగించారు. మాలిక్ ఇష్పాక్ అనే కానిస్టేబుల్ ను, అజాజ్ అహ్మద్ అనే టీచర్ ను, మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ గా వున్న వసీమ్ అహ్మద్ ఖాన్ ను విధుల నుంచి తొలగించారు.