News

ఆలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు : మంత్రి దుర్గేశ్‌

25views

ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. భగవంతుని సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ/ఎస్టీ/బీసీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్‌ గురువారం నిడదవోలులో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

అందులో భాగంగా పెరవలి మండలం నడుపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా మాత దేవాలయానికి 5 సెంట్ల స్థలం, రూ.10 లక్షలు, పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయానికి 10 సెంట్ల స్థలం, రూ.20 లక్షలు, ఉండ్రాజవరం మండలంలోని పాలంగి గ్రామంలో బీసీ కాలనీలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి 11 సెంట్ల స్థలం, రూ.20 లక్షల నిధులు కేటాయిస్తూ దేవాదాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు తెలిపారు.

రానున్న గోదావరి పుష్కరాల నాటికి పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు మంత్రి కందుల దుర్గేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోగా, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అత్యున్నత నాణ్యతతో ఈ నిర్మాణాలను పూర్తి చేసి భక్తులకు అంకితం చేస్తామని మంత్రి వెల్లడించారు.