
తిరుమలలోని కొన్ని వసతి గృహాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన గదుల అద్దెను టీటీడీ పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. గతంలో రూ.500, రూ.600 వరకు ఉండే అద్దె ప్రస్తుతం రూ.1000 వరకు ఆయా గదులను బట్టి ధర పెరిగింది.
ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. అలాగే కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దె జీఎస్టీతో కలిపి రూ.2800కు పెరిగింది. ఇక గది అద్దెతోపాటు అంతే మొత్తం నగదు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని కొత్త ప్రతిపాదన కూడా టీటీడీ పెట్టింది. అంటే 1700రూపాయల గది అద్దెకు కావాలంటే అడ్వాన్స్‌తో కలిపి 3400 చెల్లించాల్సి ఉంటుంది. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలను టీటీడీ సిబ్బంది వసూలు చేస్తున్నారు. మరోవైపు రూ.50 అద్దెతో లభించే ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, హెచ్‌వీసీ, ఏఎన్‌సీ.. రూ.100 అద్దెతో అందించే సప్తగిరి, వరాహస్వామి గెస్ట్‌హౌస్, రాంభగీచా, ఎస్‌ఎన్‌జీహెచ్, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీ అతిథిగృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో వీటి అద్దెలు కూడా త్వరలో పెంచుతారేమోననే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. తిరుమలలో వసతి కేంద్రాలను రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేశారు. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచారు. ప్రధానంగా సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యంస కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉండేవారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలు వసూలు చేసే వారు. కానీ ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు చేశారు. అయితే వసతి గృహాల అద్దె రేట్లను పెంచడంపై టీటీడీ పాలక మండలి వివరణ ఇచ్చింది. భక్తుల నుంచి వస్తున్న నిరసనలు, అసహనానికి చింతిస్తున్నట్లు తెలిపుతూనే తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని…. దీనికి 110 కోట్ల వరకు టెండర్లు ఆహ్వానించి…. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్లే అద్దె పెంచాల్సి వచ్చిందని వివరణ ఇస్తోంది. ఇక ఇవే కాకుండా సామాన్య భక్తులు బస చేసే 50, 100 రూపాయలకు లభించే గదుల అద్దెను కూడా త్వరలోనే పెంచుతామని ప్రకటించింది. వాటిల్లో కూడా ఆధునీకరణ పనులు పూర్తి చేసిన తర్వాత పెంచబోతున్నట్లుగా ముందుగానే టీటీడీ పాలకమండలి వెల్లడించింది.





