News

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జైన సంఘాల ప్రతినిధులు!

373views

జైనులు పవిత్రంగా భావించే ఝార్ఖండ్‌లోని ‘సమ్మేద్ శిఖర్’ ప్రదేశం ఉన్న పార్శానాథ్‌ కొండపై అన్ని పర్యటక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మద్యం, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించి, అక్కడి పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ జెడ్)గా ప్రకటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిబంధనలను తప్పుడు విధానంలో అమలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఈ విషయమై ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని సంప్రదించామని, తాను స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశానని కేంద్ర పర్యటక మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జైన ప్రతినిధులతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భుపేందర్ యాదవ్ సమావేశమయ్యారు. సమ్మేద్ శిఖర్జీ పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అంతకుముందు ఈ వ్యవహారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం హేమంత్ సోరెన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో 2019 ఆగస్టులో పార్శనాథ్‌ కొండను పర్యావరణ సున్నిత ప్రాంతంగా మార్చి, పర్యటకాన్ని అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాంతో అక్కడి పవిత్రతను దెబ్బతీసేలా కార్యకలాపాలు జరుగుతాయని అప్పటి నుంచి జైనులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు వివిధ జైన సంఘాల ప్రతినిధులు ప్రధాని మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు.