
గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోనే జరిగిన ఉగ్రమూకల దాడులకు ఆరుగురు మృతిచెందగా.. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దీంతోపాటు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడడంతో జమ్మూకశ్మీర్ సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారీగా పారామిలటరీ బలగాల మోహరింపు..
రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వశాఖ మోహరించింది. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ తరపున 18 వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్మూకి బయలుదేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, పారామిలటరీ దళాలు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటికే సీఆర్‌ఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. డెబ్భైకి పైగా బెటాలియన్లు జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలడంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు కాల్చి చంపాయి. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలియజేశారు.





