
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘భారత్ గౌరవ్’ పేరుతో పర్యాటక రైళ్ళను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్ళకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లభించలేదు. దీంతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రైళ్ళ టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు రైల్వేశాఖ నుంచి కూడా అనుమతి లభించినట్టు తెలుస్తోంది.
భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో గతేడాది ఈ ‘భారత్ గౌరవ్’ రైళ్ళను రైల్వేశాఖ ప్రారంభించింది. రామాయణ్ సర్క్యూట్ కింద న్యూఢిల్లీని సఫ్దార్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు.. పలు చారిత్రక ప్రదేశాలను చుట్టుముట్టి నేపాల్‌కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ జర్నీకి థర్డ్ ఏసీ క్లాస్ టికెట్ ధర రూ.62వేలుగా ఉంది.
Source: Eenadu





