
న్యూఢిల్లీ: ‘ఖచ్చితమైన సమాచారం అందించడం మీడియా ప్రధాన బాధ్యత. సమాచారాన్ని ప్రజలకు అందించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సూచించారు.
ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ 2022 ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొంటూ ‘సమాచార వ్యాప్తి వేగంగా జరగాలి. అయితే, ఇదే సమయంలో సమాచార ఖచ్చితత్వం కూడా అవసరం. ఖచ్చితత్వం అంశానికి మీడియా సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చెప్పారు.
పెరిగిన సామాజిక మాధ్యమాల సంఖ్యతో పాటు అవాస్తవ నకిలీ వార్తల ప్రసారం కూడా పెరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వార్తల బెడద నుంచి ఆ దిశగా, ఆధారం లేకుండా ప్రచురించిన వార్తలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాన్ని అందించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రభుత్వం ఫాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని చూరగొనే అంశానికి మీడియా సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీడియా పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. కరోనా సమయంలో ఇళ్లకు పరిమితం అయిన ప్రజలకు బాహ్య ప్రపంచంతో మీడియా సంబంధాలు కల్పించిందని చెబుతూ ముఖ్యంగా దూరదర్శన్, ఆకాశవాణి అందించిన సేవలను మంత్రి ప్రశంసించారు.
Source: Nijamtoday