News

జీ20 డిక్లరేషన్లో ప్రధాని మోదీది కీలక పాత్ర: అమెరికా

148views

వాషింగ్టన్‌: ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అమెరికా వెల్లడించింది. సదస్సు డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోదీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ తెలిపారు. ఈ యుగం యుద్ధాలు చేసుకునే యుగంగా ఉండకూడదని మోదీ కోరుకున్నట్టు చెప్పారు.

ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలే జీ20 సదస్సు ముగింపులో అన్ని దేశాల సంయుక్త ప్రకటనగా విడుదలైందని పేర్కొన్నారు.  బలమైన నాయకులు కలిగిన జీ20లో అమెరికా భాగస్వామ్యంగా ఉందని కరీన్ జీన్-పియర్ తెలిపారు. జీ20 దేశాలైన భారత్, అమెరికా ఆహారం, ఇంధన సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం అమెరికా ఆహార, ఇంధన భద్రత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాల్లో ఉందని పేర్కొన్నారు. తమ ప్రయత్నానికి ప్రధాని మోదీ సహకారం కీలకమని చెప్పారు. 2023లో జీ20 అధ్యక్షపదవి భారత్కు దక్కనుందని, ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడానికి అమెరికా ఎదురుచూస్తోందని వివరించారు.

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జి20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని రిషి సునక్తో సహా అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రభావం ఎక్కువగా చర్చించారు. శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిచ్చాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి