
ఈద్ సందర్భంగా గోవును వధిస్తామని ముస్లింలలోని కొన్ని వర్గాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయని, ఇది అభ్యంతరకరమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేందర్ జైన్ అన్నారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారని, అయినా గో వధను సమర్థిస్తూ ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు చెబుతుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న ప్రతిపాదననూ ఆయన తప్పుబట్టారు. హిందువుల దృష్టిలో గోవు జంతువు మాత్రమే కాదని, ఈ డిమాండ్ కూడా హిందువుల నమ్మకాలను హేళన చేసేదిగానే ఉందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆవును బహిరంగంగా వధిస్తున్నారని జైన్ పేర్కొన్నారు. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో గోవధను నిషేధిస్తూ చట్టాలున్నాయని, హిందూ సమాజం.. గోవధను అంగీకరించకూడదని ఆయన సూచించారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని నొక్కిచెప్పారు.





