
గతేడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి. ఈ పేలుడు వెనుక కీలక విషయాలను తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ వెలుగులోకి తెచ్చింది.
ఎన్‌ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ ఫరీదాబాద్‌లోని తన ఫ్లాట్‌ను బాంబు తయారీ కేంద్రంగా మార్చాడు. బాంబు తయారీ కోసం ‘రాహుల్ భట్’ అనే నకిలీ ఐడీతో ఆన్‌లైన్‌లో రసాయనాలు, ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేశాడు. ఇండియామార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు సృష్టించి పేలుడు పదార్థాలకు ఉపయోగించే వస్తువులను ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రోలిసిస్ విధానాన్ని ఉపయోగించి అతడు బాంబును తయారు చేశాడు.
సాధారణ ఉప్పు ద్రావణం నుంచి క్లోరేట్లు, పెర్కోరేట్లను తయారు చేసేందుకు నిందితుడు ఎలక్ట్రోలిసిస్ విధానాన్ని ఉపయోగించాడు. క్లోరేట్లు, పెర్కోరేట్లు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కీలక రసాయనాలు. తన ఫ్లాట్‌లోనే ఉమర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇండియా మార్ట్ ద్వారా ఎరువుల సంచులు, ఎసిటోన్ సాల్వెంట్, యానోడ్‌లు, రసాయనాలతో సహా పలు వస్తువులను ఆర్డర్ చేశాడు. వాటిని స్వయంగా డెలివరీ తీసుకున్నాడు.
ఈ కేసులో ఎన్‌ఐఏ దాదాపు 7,500 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఫరీదాబాద్, కశ్మీర్, ఢిల్లీ మధ్య పనిచేసిన ఉగ్ర మాడ్యూల్‌పై దర్యాప్తు కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో కూడా కొందరు నిందితులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.





