News

హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌ వాయిదా!

446views

చెన్నై: తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్‌ జడ్జి బెంచ్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది.

మద్రాస్‌ హైకోర్టు తమిళనాడులోని 44చోట్ల సంఘ్‌ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. 50 చోట్ల పథసంచలన్‌ నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుమతి కోరింది. ఈ నెల ఆరోతేదీన 44చోట్ల పథసంచలన్‌(కవాతు), బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు సంఘ్‌కు అనుమతి ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

కోయంబత్తూరు, మెట్టుపాళయం, పొల్లాచ్చి, తిరుప్పూర్‌ జిల్లాలోని పల్లడం, కన్యాకుమారి జిల్లాలోని అరుమనై, నాగర్‌కోయిల్‌లో హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆయా ప్రదేశాల్లో పరిస్థితి సరిగా లేనందున అనుమతి నిరాకరించింది. మరో వైపు షరతులను పాటించకపోతే అవసరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.

ఈ కార్యక్రమాలు కాపౌండ్ గోడలున్న ప్రదేశాలలో అంటే క్రీడా మైదానాలు, స్టేడియంలలో మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. ట్రాఫిక్‌కు, ఇతరులకు ఆటంకం కలిగించకుండా సొంత వాహనాలపై వాటిల్లో పాల్గొనేవారు రావాలని పేర్కొన్నది. ఎవ్వరు కూడా ఇతర వ్యక్తులు, మతాలు లేదా కులాలకు వ్యతిరేకంగా పాటలు పాడటం, మాట్లాడటం చేయరాదని తెలిపింది.

సంఘ్‌ పథసంచలన్‌లలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థలకు అనుకూలంగా, అలాగే దేశ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడొద్దన చెప్పింది. అలాగే ర్యాలీలో పాల్గొనే కార్యకర్తలు కర్రలు, ఇతర హానికారక ఆయుధాలపై సైతం ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే సంఘ్‌ ద్వారానే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవచ్చు అంటూ మద్రాస్‌ హైకోర్టు బెంచ్‌ పేర్కొంది.

తాము 50 చోట్ల పథసంచలన్‌ కోసం అనుమతి కోరితే పోలీసులు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఇచ్చారని అంటూ ఈ నెల రెండోతేదీన హైకోర్టును ఆశ్రయించారు. 24 ప్రదేశాలలో పూర్తిగా అనుమతి నిరాకరించగా, మరో 23 చోట్ల ఇన్ డోర్ ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. తమ నిర్ణయానికి మద్దతుగా 2008 నుండి 2022 వరకు ఆయా ప్రదేశాలలో నమోదైన ఎఫ్ఐఆర్‌లను పోలీసులు ప్రస్తావించారు. అయితే, అవ్వన్ని పాత ఎఫ్ఐఆర్ లని అంటూ హైకోర్టు తిరస్కరించింది. వారిలో పేర్కొన్న కారణాలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి