
విజయవాడ: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్‌తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది.
తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు. ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు.





