
-
ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళపాటు బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐపై కేంద్ర సంస్థలు మంగళవారం మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
Source: EtvBharat





