
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రధానంగా.. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానానికి భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలి. తిరుమలలో అన్నిచోట్లా సీసీ కెమెరాలను పెట్టాలని, తొక్కిసలాట జరగకుండా.. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పక్కాగా ఉండాలి. పొరుగు జిల్లాలనుంచి వచ్చే వాహనాలను పక్కాగా తనిఖీ చేయడానికి వీలుగా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. తిరుపతి విమానాశ్రయం, రైల్వేస్టేషన్ల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో వారు ప్రయాణించే మార్గాల్లోనూ భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఎస్పీ అన్నారు.





