
-
అవస్థలు పడుతున్న ప్రజలు
కోనసీమ: కోనసీమ తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి ఆదాయం ఘనంగా వస్తున్నా తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ విఫలమవుతోంది. అడుగడుగునా సమస్యలే. ఆదాయం మీద చూపిస్తున్న శ్రద్ధ భక్తులకు వసతుల కల్పనలో లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు హుండీల ద్వారా రూ.50 లక్షలు, దర్శనాలు, ప్రసాదాల అమ్మకాలు తదితర వాటి ద్వారా మరో రూ.50లక్షల ఆదాయం సమకూరుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి శనివారం 50 వేలకు పైబడి భక్తులు తరలివచ్చారు. వారంతా దర్శనాల్లో పలు ఇబ్బందులు పడ్డారు. వీఐపీల దర్శనాల్లో పైరవీలకు పెద్దపీట వేయడంతో సామాన్యభక్తులకు అవస్థలు తప్ప లేదు. సౌకర్యాలు కల్పించి లోపల ఏడు ప్రదక్షిణాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆగస్టు నెల నుంచి ప్రచారం చేస్తూనే వచ్చారు.
కానీ, భక్తులు ఎండ, వానల్లోనే ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. ఆలయంలో వసతుల కల్పనపై దర్శనానికి వచ్చిన ఉన్నతాధికారులు హామీ కూడా ఇచ్చారు. అయినా కార్యరూపం దాల్చలేదు. ఒక్క శనివారం రోజున అన్నప్రసాదాలు స్వీకరించే భక్తుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆదరాబాదరాగా నిల్చుని తినాల్సి వస్తోంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు అన్నదాన సత్రంలో కూర్చుని అన్నప్రసాదం స్వీకరిస్తున్నట్టుగానే శనివారం కూడా అదే విధానం కొనసాగించడంతోపాటు ఏడు ప్రదక్షిణాలు ఆలయం లోపల చేసుకునే విధంగా, చంటి పిల్లలు, దివ్యాంగులకు, వృద్ధులకు దర్శనాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.





