
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్ పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్ పై ఒత్తిడి పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో పుల్వామా దాడులకు మసూద్ అజర్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మొత్తం 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. మసూద్ ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని నంగ్రహార్ ప్రావిన్స్ లేదా కునార్ ప్రావిన్స్ లో తలదాచుకొని ఉండొచ్చని పాక్ ఆ లేఖలో పేర్కొంది.
ఈ ఏడాది జూన్‌లో 30 మంది ఉగ్రవాదులను వెతికి, వారిపై విచారణ జరపాలన్న భారత్ డిమాండ్ కు ఎఫ్‌ఏటీఎఫ్ లో పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఈ ఉగ్రవాదుల్లో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఆపరేటీవ్ సాజిద్ మిర్ కూడా ఉన్నారు. వీరు 2008 ముంబయి దాడులకు మాస్టర్ మైండ్లుగా పనిచేశారు. ఐరాస, ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
వాస్తవానికి మసూద్ అజర్ ను భారత్ గతంలోనే అరెస్టు చేసినా… 1999లో విమానం హైజాక్ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. మసూద్ ను అప్పగించమని భారత్ ఎప్పటినుంచో కోరుతోంది.





