News

తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్

392views

* తమ ఆఫీసులో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు

* అంతా అబద్ధమేనంటున్న పోలీసులు

మ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ గుజరాత్‌ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, దాని నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

గుజరాత్‌ పర్యటన నిమిత్తం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆ సమయంలో అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో స్థానిక పోలీసులు సోదాలు జరిపారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో వెల్లడించింది. రెండు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో వారికి ఏం దొరకలేదని పేర్కొంది. కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయిన కొద్ది గంటలకే ఈ సోదాలు జరిగాయంటూ పేర్కొంది. దీంతో ఈ పరిణామాలపై ఢిల్లీ సీఎం కూడా ట్వీట్ చేశారు. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ”గుజరాత్‌ ప్రజల నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతును చూసి భాజపాకు మతిభ్రమిస్తోంది.. ముందు ఢిల్లీలో తనిఖీలు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ సోదాలు మొదలుపెట్టారు. ఢిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా వారికేం దొరకదు. ఎందుకంటే మేం నిజాయతీ గల నాయకులం” అని రాసుకొచ్చారు.

అయితే ఈ సోదా కట్టుకథలను గుజరాత్‌ పోలీసులు తోసిపుచ్చారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణలపై నవరంగ్ ‌పురా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పీకే పటేల్‌ మాట్లాడుతూ.. ”సోదాలపై ఆప్‌ నేతల ట్వీట్లు చూడగానే ఆదివారం రాత్రి నేనే స్వయంగా పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించాను. తనిఖీలు చేసేందుకు ఎవరు వచ్చారనే వివరాల గురించి అక్కడ ఉన్న నేతలను అడిగాను. కానీ ఆప్‌ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు” అని పేర్కొన్నారు.

మరోవైపు, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారు మరో సమస్యలో చిక్కుకుంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన ‘లోఫ్లోర్‌ బస్సు’ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదును సీబీఐకి పంపేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) వి.కె.సక్సేనా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపైనా ఆప్‌ నేతలు మండిపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.