News

భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం

212views

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) సెక్రటరీ జనరల్‌ నయాఫ్‌ ఫల్హా ముబారక్‌ అల్ హజ్రఫ్ ‌తో ఆయన భేటీ అయ్యారు. సంప్రదింపులకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. జీసీసీలో మొత్తం ఆరు దేశాలకు సభ్యత్వం ఉంది.

జైశంకర్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి సౌదీలో పర్యటిస్తున్నారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేస్తూ..”జీసీసీ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ నయాఫ్‌ ఫల్హా ముబారక్‌ అల్‌ హజ్రఫ్ ‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత్ ‌- జీసీసీ మధ్య సంప్రదింపుల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇరు పక్షాల సంబంధాల కోణంలో ప్రస్తుత ప్రపంచ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను తెలుసుకున్నాం ‘ అని ఆయన పేర్కొన్నారు.

బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈల సమష్టి ప్రభుత్వ, రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంతోనే జీసీసీని ఏర్పాటు చేశారు. భారత్ ‌కు జీసీసీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్‌ ఎగుమతులు, పెట్టుబడులు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. జీసీసీలోని దేశాల్లో ప్రస్తుతం 65 లక్షల మంది భారతీయులు పనులు చేస్తున్నారు. భారత్‌-జీసీసీ మద్య 2020-21లో 87.36 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.