News

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ

191views

* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం

* ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’

బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అడ్డుకున్నారు. ఆమె బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సమీప బంధువు. ఆమెకు విమానాశ్రయంలోనే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన మనేకా గంభీర్… బ్యాంకాక్‌ చెక్కేయడానికి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్ ‌పోర్టుకు చేరుకున్నారు. నిజానికి ఈడీ గతంలోనే ఆమెపై లుకవుట్‌ నోటీసులు జారీ చేసి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ లభించలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారాన్ని ఈడీకి చేరవేయగా వారు వెంటనే అక్కడకు చేరుకుని మనేకా ప్రయాణించడానికి అనుమతి లేదని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్ ‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అక్కడే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె తిరిగి తన నివాసానికి వెళ్లిపోయారు.

ఈ కేసులో మనేకా గంభీర్ ‌ను ఈడీ ఇప్పటి వరకూ విచారించలేదు. గతంలో సీబీఐ విచారణకు మాత్రం ఆమె హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. దీనిపై ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తనను స్థానిక ఈడీ కార్యాలయంలోనే విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన కోర్టు ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.