
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ లో రూ.9.83 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ చెల్లింపులు ఆగస్టు నాటికి రూ.10.73 లక్షల కోట్లకు పెరిగాయి.
అదే సమయంలో ‘పాయింట్ ఆఫ్ సేల్ (PoS)’ వద్ద క్రెడిట్ కార్డు చెల్లింపులు రూ.29,988 కోట్ల నుంచి రూ.32,383 కోట్లకు చేరాయి. అలాగే ఈ-కామర్స్ వేదికలపై కార్డు చెల్లింపులు రూ.51,375 కోట్ల నుంచి రూ.55,264 కోట్లకు ఎగబాకాయి. మరోవైపు 2016-17 నుంచి 2021-22 మధ్య క్రెడిట్ కార్డు బకాయిల విలువలో ఏటా 16 శాతం వృద్ధి నమోదైందని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ రామ్మోహన్ రావు అమర తెలిపారు. క్రెడిట్ కార్డులు పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల వ్యయాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్ కార్డు చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయని వెల్లడించారు. ఈ పండగ సీజన్‌లో అది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. డిజిటల్ లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని నిపుణులు తెలిపారు. రోజురోజుకీ వినియోగదారుల్లో వివిధ రకాల డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెరుగుతోందన్నారు.





