News

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ

383views

* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి

ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ సెక్టార్‌ కంపెనీల అభివృద్ధికి నిధులు ఎప్పుడూ ప్రభుత్వం నుంచే వస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రారంభించిన మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ను ఆ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండాలా..? అన్న ప్రశ్నకు భార్గవ స్పందించారు. ”ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండకూడదన్న దాంట్లో నాకెలాంటి సందేహం లేదు. అవి కంపెనీలను సక్రమంగా నిర్వహించలేవనేది వాస్తవం. ఆ కంపెనీల్లో ఆశించిన స్థాయి ఉత్పాదకత ఉండదు. లాభాలను సంపాదించలేరు. వనరులు సృష్టించలేరు. విస్తరించలేరు. వారు విస్తరించాలన్న ప్రతిసారి ప్రభుత్వ మద్దతు తీసుకొంటారు” అని పేర్కొన్నారు.

”సొంత వనరులతో ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేవు. చాలా వరకూ వాటి పెట్టుబడి ప్రభుత్వ నిధుల ద్వారా వస్తుంది. అంతర్గత వనరులను బలోపేతం చేసుకుంటేనే పారిశ్రామిక వృద్ధి లభిస్తుంది. ఒక కంపెనీ కచ్చితంగా సంపదను సృష్టించాల్సిందే. అంతేకానీ.. సంపదను హరించకూడదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు సంపద సృష్టికర్తలు కాదు. సంపద సృష్టి అనే లక్ష్యాన్ని అందుకోలేకపోతే.. మీ వద్ద ఉన్న వ్యవస్థ నష్టాలను ఇచ్చేదే అవుతుంది. నాసిరకం పనితీరును ప్రోత్సహించేలా.. మీరు ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన సొమ్మును తీసుకెళ్లి వాడితే దేశం నష్టపోతుంది” అని భార్గవ వెల్లడించారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థల మితిమీరిన జోక్యం వంటి కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వెళ్లలేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా, యూకే, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి చోట్ల విఫలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆయా దేశాలు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బయటకు వచ్చేశాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.