
లక్నో: ఉత్తరప్రదేశ్ మేరఠ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు లిసాడిగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
‘ట్రిపుల్ తలాక్ కోసం నా భర్త విడాకుల నోటీసులు పంపాడు. నోటీసులు అందగానే భర్తతో మాట్లాడాను. దానికి ఆయన చెప్పిన సమాదానం నన్ను షాక్‌కు గురిచేసింది. నేను లావు అయ్యానని అందుకే.. విడాకులు ఇస్తున్నానని తెలిపాడు. నాకు పోలీసులే న్యాయం చేయాలి. నాకు ఎనిమిదేళ్ళ క్రితం సల్మాన్‌తో వివాహమైంది. ఏడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. నెల క్రితం భర్త సల్మాన్ నన్ను ఇంటి నుంచి గెంటేశాడు’ అని బాధితురాలు పేర్కొంది. కాగా, ట్రిపుల్ తలాక్ కేసు తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. అలాంటి ఫిర్యాదులు ఏమైనా వస్తే మాత్రం కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Source: EtvBharat





