News

గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్ రైలు రికార్డు

376views

* రానున్న మూడేళ్లలో 400 స్వదేశీ రైళ్ల తయారీ – ట్విట్టర్ లో రైల్వే శాఖ మంత్రి

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

2019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ – వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా కోటా (రాజస్థాన్‌) – నగ్దా (మధ్యప్రదేశ్‌) సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వందేభారత్ రైలు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు కేంద్రమంత్రి తన ట్విట్టర్‌లో పోస్ట్ ‌చేశారు.

రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్ ‌ను స్మార్ట్ ‌ఫోన్‌లో ఆన్‌ చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.