* శ్రీనగర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం
మరికొద్ది సేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దాయాది దేశాలు తలపడుతుంటే వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ జట్ల మధ్య పోరును కొంత మంది అభిమానులు ప్రతిష్ఠాత్మకంగా భావించి.. పలు సందర్భాల్లో అల్లర్లు, గొడవలు చెలరేగిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ ను గుంపులుగా వీక్షించకూడదని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోకూడదని స్పష్టం చేసింది.
భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్ డీన్ విద్యార్థులకు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో ఎవరికి కేటాయించిన గదుల్లో వారే ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు క్రీడలను క్రీడలుగానే పరిగణించండి. ఇన్‌స్టిట్యూట్ / హాస్టల్‌లో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడొద్దు’ అంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆదివారం మ్యాచ్ సందర్భంగా ఎవరి గదుల్లో వారు ఉండాలని.. ఇతరులను తమ రూముల్లోకి అనుమతించి గుంపులుగా మ్యాచ్ చూడకూడదని పేర్కొంది.
‘ఏదైనా గదిలో గుంపులుగా మ్యాచ్ చూస్తున్నట్లు తెలిస్తే.. ఆ గదిలో వారిని ఇన్‌స్టిట్యూట్ నుంచి డిబార్ చేస్తాం. ఆ గదిలో గుర్తించిన విద్యార్థులందరికి రూ.5వేల వరకు జరిమానా విధిస్తాం’ అని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు హాస్టల్ గదుల నుంచి బయటకు రావద్దని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోగా శ్రీనగర్ ఎన్‌ఐటీలో అల్లర్లు చెలరేగాయి. ఎన్‌ఐటీ విద్యార్థులకు, బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఫలితంగా ఇన్‌స్టిట్యూట్ ను కొన్నిరోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యానే రక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం NIT పాలకవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.