
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్లోనే 12వేల గోవులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ తోపాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది.
రాజస్థాన్‌లో ఇప్పటివరకూ మొత్తం 2,81,484 పశువులకు లంపీ చర్మవ్యాధి సోకగా వాటిలో 2,41,685 పశువులకు చికిత్స అందించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఆగస్టు 10 నాటికి మొత్తంగా 12,800 పశువులు మృతి చెందగా.. శ్రీ గంగానగర్‌లోనే అత్యధికంగా 2511 పశువులు మరణించాయి. బార్మెర్‌లో 1619, జోధ్ పూర్‌లో 1581, బికనెర్ లో 1156, జరోల్ లో 1150 పశువులు లంపీ స్కిన్ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటివరకూ ఐదు జిల్లాల్లోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ వెల్లడించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ వ్యాధి ప్రాబల్యం అత్యధికంగా రాజస్థాన్ లో ఉండగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్ లలోనూ వందల సంఖ్యలో పశు మరణాలు సంభవిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.





