News

రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు

177views

జాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా’ హర్ ‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. వాడవాడలా జెండా ప్రదర్శనలతో ప్రజలు దేశభక్తిని చాటుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని శ్లాఘిస్తున్నారు.

విశాఖలో సీఆర్పీఎఫ్ జవాన్లు బీచ్‌ రోడ్‌లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద హెచ్పీసీఎల్ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది. ఏలూరులో 60 అడుగుల మువ్వన్నెల పతాకంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 100 మీటర్ల పొడవైన జాతీయ జండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అల్లూరి జిల్లా పాడేరు సీఆర్పీఎఫ్‌ 234 బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నందిగామ, జగ్గయ్యపేటలో లో 500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, వాలంటీర్లు ప్రదర్శన చేశారు. కడప జిల్లా పులివెందులలో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు.. త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేశారు. కర్నూలులో సర్వేపల్లి విద్యానిలయం పాఠశాల విద్యార్థులు 500 అడుగుల జాతీయ జెండాతో కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు.

విజయవాడతో సహా రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాలలో త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. పాఠశాల బాలబాలికలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, మహిళలు, పిన్నలు పెద్దలు త్రివర్ణ పతాకాలు చేతబూని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో ప్రతి ఇంటి మీదా త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ కనిపిస్తోంది. మొత్తానికి ఈ అమృతోత్సవ వేళ రాష్ట్రంలో అడుగడుగునా జాతీయ స్ఫూర్తి కనిపిస్తోంది. ప్రజలలో దేశభక్తి తొణికిసలాడుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.